Monday, November 25, 2024

Delhi | సహకారం ద్వారా సమృద్ధి.. కోఆపరేటివ్ కాంగ్రెస్‌లో రేపు ప్రధాని ప్రసంగం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ సహకార సంఘాల దినోత్సవం సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో జరగనున్న 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ‘సహకార్ సే సమృద్ధి’ నినాదంతో సహకార ఉద్యమానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్‌లో ప్రధాని పాల్గొనడం మరో ముందడుగుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జులై 1, 2 తేదీల్లో రెండ్రోజుల పాటు 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ జరగనుంది. సహకార రంగంలో సరికొత్త ధోరణులు (ట్రెండ్స్), ఆచరిస్తున్న ఉత్తమ అభ్యాసాలు, ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళ గురించి ఈ సమావేశంలో చర్చోపచర్చలు జరగనున్నాయి. భారతదేశంలో సహకార ఉద్యమం వృద్ధి కోసం రాబోయే కాలంలో అమలుపరచవలసిన విధానపరమైన దిశను రూపొందించుకోవడం ఈ కాంగ్రెస్ ధ్యేయాలుగా ఉన్నాయి.

‘‘అమృత కాలం: ఒక చైతన్య వంతమైన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం సహకార రంగం ద్వారా సమృద్ధిని సాధించడం’’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఏడు సాంకేతిక సదస్సులను ఏర్పాటు చేసినట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 3,600 కు పైగా సంబంధిత రంగానికి చెందిన భాగస్వాములు పాల్గొంటారని వెల్లడించింది. ప్రాథమిక స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు విస్తరించిన సహకార సంఘాలు, అంతర్జాతీయ సహకార సంస్థల ప్రతినిధులు, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలు, తదితర వర్గాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారని తెలియజేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement