Tuesday, November 26, 2024

విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు రాలేదు.. వైఎస్సార్సీపీ ఎంపీల ప్రశ్నపై కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం), డా. బి. వెంకట సత్యవతి (అనకాపల్లి) గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం పేర్కొన్నారు. మొత్తం 75.3 కి.మీ పొడవున రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో ‘వైజాగ్ మెట్రో ప్రాజెక్టు’ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రతిపాదనలు వచ్చాయా అన్న ప్రశ్నకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. అయితే 2018లో 42.55 కి.మీ పొడవున రూ. 8,300 కోట్ల ఖర్చుతో ‘లైట్ మెట్రో రైల్’ ప్రాజెక్టు కోసం మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆర్థిక సహాయానికి నిరాకరించిందని వెల్లడించారు.

- Advertisement -

ఇకపోతే పట్టణ రవాణా అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, మెట్రో రైల్ ప్రాజెక్టులు, సమగ్ర రవాణా ప్రణాళికలు, ప్రత్యామ్నాయ విశ్లేషణ నివేదికలు, డీపీఆర్‌ల రూపకల్పన వంటివన్నీ పూర్తిగా రాష్ట్రాల చేతిలోనే ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపిస్తే ఆ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వనరుల లభ్యతను బట్టి వీలైనంత మేర ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం పరిశీలిస్తుందని అన్నారు. మరోవైపు విశాఖపట్నంతో పాటు ఏపీలోని మరో 9 నగరాలు (ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు)కు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పనకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు. అలాగే విజయవాడ మెట్రో రైల్ కోసం నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంటిగ్రేషన్ ప్లాన్, ఇంటిగ్రేడెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్ రూపకల్పనకు 2018-19లో కేంద్రం రూ. 78.44 లక్షలు విడుదల చేసిందని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement