బీజేపీ లీడర్లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లోని హింస చెలరేగడంతో హౌరా పోలీస్ కమీషనర్ సి. సుధాకర్, రూరల్ ఎస్పీ సౌమ్యారాయ్‌ని సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కాగా వీరి స్థానంలో కొత్త కమిషనర్‌గా ఐపీఎస్ ప్రవీణ్ త్రిపాత్, రూరల్ ఎస్పీగా ఐపీఎస్ స్వాతి భంగాలియా నియమితులయ్యారు. అయితే.. నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో చాలామందికి గాయాలయ్యాయి. బీజేపీ కార్యాలయాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు.
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, పార్టీ లీడర్ నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిన్న హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతలు క్షీణించడంతో 144 సెక్షన్ విధించారు. హింసాత్మక నిరసనలు, పోలీసులతో ఘర్షణల సమయంలో ఆందోళనకారులు రాళ్లదాడికి దిగడమే కాకుండా.. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. చాలాచోట్ల ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తతలు సద్దుమణిగేదాకా జూన్ 13వరకు హౌరా జిల్లా అంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఉలుబెరియా, దోమ్‌జూర్, పంచలా వంటి ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో విధించారు. జూన్ 15 వరకు పోలీసు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.