న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. రెండు రాష్ట్రాలు తమ తమ ప్రతిపాదనలు అందజేసినట్టు తెలిసింది. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, రాష్ట్ర విభజన తర్వాత విభజన అంశాల పర్యవేక్షణ బాధ్యతల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేమచంద్రా రెడ్డి, ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాధ్ దాస్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ హాజరవగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ విభజన అంశాల పర్యవేక్షణ బాధ్యతల ఇంచార్జి, ఆర్ధిక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు హాజరయ్యారు. రాష్ట్రాల విభజన, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర హోంశాఖలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి పార్ధసారధి అధ్యక్షత ఈ భేటీ జరిగింది. వారం తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్లు పూర్తికావొస్తున్నా.. ఉమ్మడి ఆస్తుల పంపకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రం వెలుపల ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకటి. ఉమ్మడి భవన్ విభజన కోసం 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 రకాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది. న్యూఢిల్లీలో ఇండియాగేట్‌కు అత్యంత సమీపంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 20 ఎకరాల స్థలాన్ని పంచుకునే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికీ ఈ పంచాయితీ తేలడం లేదు. మొత్తం 19.73 ఎకరాల స్థలాన్ని తమకే అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. నిజాం ఆస్తి ‘హైదరాబాద్ హౌజ్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు బదులుగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించారని, నిజాం ఆస్తికి వారసత్వం తమకే ఉందని, ఆ ప్రకారం మొత్తం స్థలాన్ని తెలంగాణకే కేటాయించాలని వాదిస్తోంది.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న ప్రకారం రాష్ట్రం వెలుపల ఆస్తులను సైతం 58:42 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు 2018లో రెండు రకాల ప్రతిపాదనలను ఆ రాష్ట్రం ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఇప్పటికే నిర్మించిన భవనాలను తెలంగాణకు కేటాయించే పక్షంలో ఖాళీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించేలా.. లేదంటే ఖాళీ స్థలాన్ని తెలంగాణకు కేటాయించిన పక్షంలో భవనాలున్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించేలా ప్రతిపాదనలున్నాయి. ఈ లెక్కన మొత్తం 19.73 ఎకరాల స్థలంలో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది.
విభజన చట్టంలోని సెక్షన్ 66 కూడా ఇదే విషయం చెబుతోంది. ఇంతకాలం పాటు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న భవనాలు (బిల్టప్ ఏరియా) తమకే ఇవ్వాలని, ఖాళీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఏ ప్రతిపాదనైనా సరే జనాభా నిష్పత్తి ప్రకారమే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు తెలిసింది.