రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు నెలలు అవుతున్నా.. కాల్పుల విరమణ, బలగాల ఉప సంహరణ మాటే లేదు. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. అయితే రష్యా దాడితో ఉక్రెయిన్ స్మశానంలా మారింది. మళ్లీ ఉక్రెయిన్‌ను నిర్మించుకునే విషయంలో ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ ఆర్థికంగా ఎంతో కోల్పోయిందని అభిప్రాయపడింది. మళ్లీ ఉక్రెయిన్‌ను నిర్మించుకోవాలంటే కొన్నేళ్లు పడుతుందని తెలిపింది. అయితే ఈ విషయంలో ఉక్రెయిన్‌కు నిధుల అవసరం ఎంతో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని ప్రపంచ బ్యాంకు గుర్తు చేసింది. ఉక్రెయిన్‌ను తీవ్ర ఆర్థిక నష్టం నుంచి కోలుకునేందుకు ప్రతీ నెల 7 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని జెలెన్ స్కీ వివరించారు.
దేశం మొత్తాన్ని నిర్మించాలంటే.. వందల బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని అన్నారు. రష్యా ఆస్తులను సీజ్ చేసిన దేశాలు.. ఆ డబ్బును ఉక్రెయిన్ పునర్ నిర్మాణానికి ఉపయోగించాలనే ప్రతిపాదనను జెలెన్ స్కీ ముందు ఉంచారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. భవనాలు, మౌలిక సదుపాయాలు అన్నీ నష్టపోయిందని, ఇప్పటి వరకు జరిగిన భౌతిక నష్టం సుమారు 60 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధం కొనసాగుతున్నా కొద్దీ.. నష్టం మరింత పెరుగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.