Tuesday, November 26, 2024

పట్టణ ప్రగతికి పక్కాగా ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌లలో జూన్‌ 3 నుంచి 18 వరకు జరిగే నాలుగో విడత పట్టణ ప్రగతికి పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, అడిషనల్‌ కలెక్టర్లు(లోకల్‌బాడీస్‌) సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర మునిసిపల్‌ డైరెక్టర్‌(సీడీఎంఏ) ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌లలో పబ్లిక్‌ టాయిలెట్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ స్టేటస్‌ సాధించడం కోసం ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్‌కల్లా మునిసిపాలిటీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన వైకుంఠధామాలను సందర్శించి అవి పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిషన్‌ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని వైకుంఠధామాలకు తాగునీరు సరఫరాపక్కాగా జరిగేలా చూడాలనిఆదేశించారు. మునిసిపాలిటీల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపులు జరపడంతో పాటు హరితహారంలో భాగంగా ప్రతి వార్డులోను నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్బన్‌ ఫారెస్ట్‌లను పునరుజ్జీవం చేయాలని కోరారు. చెరువు గట్లపై సిల్వర్‌ ఓక్‌ చెట్లను పెంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌లకు కావాల్సిన స్థలాలపై సంబంధిత మంత్రులతో కేటాయింపులు పూర్తి చేయించుకోవాలని, స్థల కేటాయింపులు పూర్తి చేసుకుని మార్కెట్ల నిర్మాణాన్నివెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పరమపద వాహనాలను ఈ పట్టణ ప్రగతిలో భాగంగా సమకూర్చుకోవాలని కోరారు.

తెలంగాణ పురపాలక క్రీడా ప్రాంగణాలు…

ప్లేస్‌ టు ప్లే పేరుతో తెంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అన్ని మునిసిపాలిటీల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ డైరెక్టర్‌ సూచించారు. వార్డు స్థాయి క్రీడా మైదానాలతో పాటు మునిసిపాలిటీస్థాయి క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకుగాను చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రీడా కేంద్రాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసి అనువైన స్థలాలను ఎంపికచేయడంతో పాటు జూన్‌ 2 కల్లా ఆయా మైదానాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలన్ని సక్రమంగా అమలయ్యేలా మునిసిపల్‌ కమిషనర్లందరు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో మునిసిపల్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. కాగా సీఎంతో జరిగిన సమావేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మునిసిపాలిటీలు, పేలవమైన పనితీరు కనబరిచిన మునిసిపాలిటీల జాబతా తయారు చేయాలని ఆదేశాలు కూడా వచ్చినట్లు సర్క్యులర్‌లో తెలిపారు. అవసరమైతే మునిసిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు బృందాల వారిగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వెళ్లి శానిటేషన్‌పై అధ్యయనం చేసి రావాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement