Thursday, November 21, 2024

Big story | ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లపై సత్వర చర్యలు.. లోటుపాట్లను సవరిస్తున్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై రిజిస్ట్రేషన్ల శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లాలో ఇప్పటికే కార్డు-2 రిజిస్ట్రేషన్ల విధానం అమలు చేస్తోంది. కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేలా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా లోటుపాట్లను సవరించుకొని తొందరలోనే రాష్ట్రం మొత్తం అమలుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విధానంలో కొత్త విధానం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించేలా కొత్త విధానం రూపొందించింది. ఆన్‌లైన్‌లో దస్తావేజులు తయారు చేసుకోవడంతో పాటు వినియోగదారులే వివరాలు నమోదు చేసుకొని ఫీజు చెల్లించేలా కొత్త విధానంలో వెసులుబాటు కలిపించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 20 నిమిషాల్లోనే డాక్యుమెంట్లు సిద్ధమవుతాయి.

ఇప్పటికే ఈ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కూడా కొత్త ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు కొట్టి పారేస్తూ భరోసా ఇచ్చింది. తొందరలోనే అమలులోకి రానున్న కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంలో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు ఒనగూరతాయని అధికారులు చెపుతున్నారు.

- Advertisement -

ఫీజు ఖచ్చితత్వం..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఫీజులపై అనేక అపోహలు ఉన్నాయి. అధికారులు ఒక్కొక్క ప్రాంతంలో వేర్వేరు రిజిస్ట్రేషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నట్లు పలు విమర్శలు ఉన్నాయి. గతంలో అనేక చోట్ల అధికారులపై వినియోగదారులు తిరగబడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొత్త విధానంలో విమర్శలకు తావులేని రీతిలో ఫీజులు ఉంటాయని అధికారులు చెపుతున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో సర్వే నంబర్‌ కొట్టిన వెంటనే నిర్థేశిత ఫీజు డిస్‌ప్లే అవుతుంది. తద్వారా వినియోగదారులు ఏ విధమైన అపోహలు చెందకుండా నిర్థేశిత ఫీజును చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

అవన్నీ అపోహలే..

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో తీసుకున్న డాక్యుమెంట్లు చెల్లవనేది అపోహలుగానే అధికారులు కొట్టివేస్తున్నారు. వీటికి వివిధ సంస్థల నుంచి చట్టబద్ధత ఉందని చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై అధికారులకు అవగాహన కలిగించారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపధ్యంలో బ్యాంకర్లు సైతం రుణాలు సహా వివిధ అవసరాలకు ఆ డాక్యుమెంట్లను అనుమతిచ్చేందుకు సమ్మతి తెలిపారు. ఇతర సంస్థలతో కూడా ఇప్పటిక ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి స్పష్టత తీసుకుంది.

అవినీతికి అడ్డుకట్ట..

పూర్వపు మాన్యువల్‌ రిజిస్ట్రేషన్లతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తేవి. దళారుల ప్రమేయంతో ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు ముట్టచెప్పాల్సి వచ్చేది. నేరుగా అధికారులను కలిస్తే పనులు సకాలంలో కాక తప్పనిసరి స్థితిలో దళారులను ఆశ్రయించక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల పేర్లు చెప్పి దళారులు రూ.వేలు గుంజేవారు. విధిలేని స్థితిలో కొనుగోలు, అమ్మకం దారులు సైతం ఇవ్వక తప్పేది కాదు. కొత్తగా వచ్చిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో ఆ పరిస్థితి ఉండదని చెపుతున్నారు.

నేరుగా ఎవరికి వారే సొంతంగా డాక్యుమెంట్‌ తయారు చేసుకొని స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంటుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, ఫీజులు సహా అన్ని ఆన్‌లైన్‌లోనే స్పష్టంగా తెలుస్తాయి. ఆ మేరకు ఫీజులు చెల్లించే వెసులుబాటుతో దళారులను ఆశ్రయించే అవసరం ఉండదు. కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం ప్రజలు ఎంతో మేలు చేకూర్చుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement