Saturday, November 23, 2024

ఇ-మెబిలిటీకి ప్రోత్సాహం, దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాబోయే పదేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక ప్రయత్నాల్లో భాగంగా బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడానికి ఈ-మొబిలిటీని అనుసరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపర్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని బీఈఈ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. శక్తి సంరక్షణ మరియు శక్తి సామర్థ్యం కోసం వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, లక్నో, బెంగళూరు, జైపూర్‌ వంటి ప్రధాన నగరాలతోపాటు అతి త్వరలో అన్ని రాష్ట్రాలతో సమీక్షా సమావేశాల నిర్వహణకు బీఈఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే రాష్ట్ర ప్రభుత్వాలచే నియమించబడిన ఏజెన్సీలతో ఈ-మొబిలిటీపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఇ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తూ, దేశంలో విద్యుత్‌ చైతన్యానికి పునాది వేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు సంబంధిత విభాగాలు అనేక క్రియాశీలక చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో ఈ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఈవీ విధానాలను రూపొందించాయని వివరించారు. అదనంగా పబ్లిక్‌ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల విస్తరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన, సరసమైన మరియు సమర్థవంతమైన ఎలక్ట్రిక్‌ మరియు హైబ్రిడ్‌ వాహనాల ప్రేరణను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని వేగంగా స్వీకరించడం కోం ఎఫ్‌ఏఎంఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

రూ. 10 వేల కోట్లతో..

ఇందుకోసం ఫేజ్‌-2కింద రూ.10 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని డీజీ తెలిపారు. 3 సంవత్సరాల (2019-22) కాలానికి ఈ రూ. 10 వేల కోట్లను 1 ఏప్రిల్‌ 2019 నుండి వినియోగించడం ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే, దీనిని ఇప్పుడు 31 మార్చి 2024 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈమొత్తం బడ్జెట్లోలో దాదాపు 86 శాతం అంటే రూ.8,596 కోట్ల నిధులను డిమాండ్‌ ఇన్సెంటివ్‌ కోసం కేటాయించారని చెప్పారు, అంటే, ఇన్సెంటివ్‌పై పరిమితి ఉన్న 2 వీలర్ల కోసం కిలోవాట్‌కు రూ.15 వేలు వంతున కేటాయించడం జరుగుతోందన్నారు. మొత్తం ఖర్చులో ఇది 40 శాతం ఉంటు-ందని పేర్కొన్నారు. 3 మరియు 4-వీలర్ల వాహనాలకు కిలోవాట్‌కు రూ. 10 వేలు మరియు ఎలక్ట్రిక్‌ బస్సులు మరియు ట్రక్కులకు కిలోవాట్‌కు రూ.20 వేల వంతున కేటాయించడం జరుగుతోందన్నారు. ఫలితంగా 7 వేల ఎలక్ట్రిక్‌-బస్సులు, 5 లక్షల ఈ-3 వీలర్లు, 55 వేల ఈ-4 వీలర్‌ ప్యాసింజర్‌ కార్లు (స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌తో సహా) మరియు 10 లక్షల ఈ-2 వీలర్‌లకు ఈ నిధులను కేటాయించడం ద్వారా డిమాండ్‌కు తగిన విధంగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈఎఫ్‌ఏఎంఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 4.08 లక్షల వాహనాలు విక్రయించబడుతున్నాయని తెలిపారు. దీనివల్ల రోజుకు 3,76,801 లీటర్ల ఇంధనం ఆదా అవుతోందని, అందువల్ల రోజుకు 857441 కిలోల కార్బన్‌ తగ్గింపునకు అవకాశం ఏర్పడిందని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటివరకూ 15,865 ఈ- వాహనాలను విక్రయించారని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement