Tuesday, November 26, 2024

Delhi | విభజన హామీలు, అమరాతిని అభివృద్ధిపై ప్ర‌స్తావ‌న‌.. అఖిలపక్ష భేటీలో గల్లా, కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విభజన హామీల అమలు అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. గురువారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రప్రభుత్వం విపక్షాలను కోరింది. టీడీపీ తరఫున ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కనకమేడల విజయ్ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసారి దాదాపు 30 బిల్లులను తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించిందన్నారు.

పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించామని ఆయన చెప్పారు. విభజన చట్టం అమలుకు ఇంకా కేవలం పది నెలలే సమయం ఉన్నందున పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఏం చర్యలు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించామని ఎంపీ వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ఏవిధమైన పురోగతి లేదని, కేంద్రమే చొరవ తీసుకుని పూర్తి చేయాలని ఆయన అన్నారు.

- Advertisement -

అమరావతినే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఏపీ సర్కారు సుమారు 10 లక్షల కోట్ల అప్పులు చేసి రుణ భారాన్ని ప్రజల నెత్తిన పెట్టిందని, రాష్ట్రం మొత్తం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని రవీంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతి వ్యక్తి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీల జరుగుతున్న దాడులు, హింస గురించి కూడా సమామేశంలో మాట్లాడామని ఆయన వెల్లడించారు.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు బీమా, నష్ట పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. చిన్న పార్టీలకు కూడా సమావేశాల్లో చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మీటింగుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ కూటమి అనేది శాసనం కాదన్న ఆయన, ఏదో ఒక కుటుంబంలో ఉండాలన్న నిబంధన ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

కూటమిలో లేకపోతే మాది రాజకీయ పార్టీ కాకుండా పోదని ఎంపీ రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. తమ అజెండా, తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసే పార్టీలను బట్టి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. తమ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఏ కూటమి ముందుకు వస్తుందో చూస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను బట్టే తమ వైఖరి ఉంటుందని కనకమేడల రవీంద్రకుమార్ తేల్చి చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement