Saturday, November 23, 2024

Delhi | ‘ఆపరేషన్ ప్రొటోకాల్’ ఉంటేనే ప్రాజెక్టులు అప్పగించాలి : బీ ఆర్ ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నేతృత్వంలో ఎంపీలు  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ‘ఆపరేషన్ ప్రొటోకాల్’ లేకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే ఆపరేషన్ ప్రొటోకాల్ అమలు చేయాలని సూచించింది.

అలాగే కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తయి రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చే వరకు 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని షెకావత్‌ను కోరారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా బేసిన్ వెలుపల నీటి తరలింపు 34 టీఎంసీలు (15 టీఎంసీలు చెన్నైకు, 19 టీఎంసీలు ఎస్ఆర్బీసీకి) మాత్రమే పరిమితం చేయాలని, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇంతవరకే ఆమోదించిందని గుర్తుచేశారు. అలాగే గతంలో వినియోగించుకోకుండా వదిలేసిన నీటి వాటాను తదుపరి ఏడాది ఖాతాలో వేసి ఉపయోగించుకుంటామని ఏ రాష్ట్రం చెప్పినా సమంజసం కాదని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ -1 సైతం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొందని అన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ బెటాలియన్ అవసరం లేదని లేఖలో తెలిపారు.

అనంతరం ఓ వీడియో క్లిప్ విడుదల చేసిన బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు కేఆర్ఎంబీ వల్ల తెలంగాణకు జరిగే నష్టాలను కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర మంత్రి తెలిపారని, కానీ ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయనకు వివరించి చెప్పామన్నారు. బీఆర్ఎస్‌ ఎంపీలు ఇచ్చిన లేఖను కూడా పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాలని షెకావత్‌ను కోరినట్లు వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంట్‌‌ ఉభయ సభల్లోనూ పోరాడతామని నామ నాగేశ్వరరావు ప్రకటించారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, నామ నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, కేఆర్ సురేశ్ రెడ్డి ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement