Saturday, November 23, 2024

శాంతితోనే ప్రగతి సాధ్యం.. రాజకీయాల్లో క్రమశిక్షణ, అంకితభావం ఉండాలి: ఉప‌రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పరస్పర సమన్వయం, సహనమే భారతీయ జీవన విధానమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శాంతియుత వాతావరణం నెలకొన్నప్పుడే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. భారతదేశంలో మొదటి నుంచీ మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కుల, మతాల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్‌షిప్’ విద్యార్థులతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి, రాజకీయాలు పవిత్రమైన వృత్తి అని.. ఇందులో రాణించాలంటే క్రమశిక్షణతోపాటు అంకితభావం కలిగుండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న ఉపరాష్ట్రపతి రాజకీయ నాయకులతోపాటు ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.

ప్రజాజీవితంలోకి రావాలనుకునేవారు క్రమశిక్షణతోపాటు దేశం కోసం, మన ప్రాంత ప్రజల కోసం మంచిచేయాలన్న తపన, అన్ని అంశాలను సహనంగా వినడం, విమర్శల్లోని సానుకూల అంశాలను స్వీకరించడం, ప్రజాభిప్రాయాన్ని అంగీకరించడం నేర్చుకోవాలన్నారు. ఇష్టపడిన ఏ విషయంలోనైనా కష్టపడి పనిచేస్తే నష్టపోయేది ఉండదని ఉపరాష్ట్రపతి సూచించారు.

విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమై ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజాజీవితంలో, తదనంతరం ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రజలతో మమేకమైన సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాలు, వాటినుంచి నేర్చుకున్న పాఠాలను ఉపరాష్ట్రపతి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ప్రముఖ నాయకులు, మేధావులు, రాజ్యాంగ నిపుణుల ప్రసంగాలను వినడం, వారి రచనలను చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ జ్ఞానానికి కష్టపడి, చిత్తశుద్ధితో పనిచేయడం తోడైతే రాజకీయాల్లో రాణించగలమన్నారు.

తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఉదయం తొందరగానే చేరుకుని అసెంబ్లీ లైబ్రరీలకు వెళ్లేవాడినని, అక్కడ గతంలో అసెంబ్లీలోని ప్రముఖులు చేసిన ప్రసంగాలను చదివేవాడినని విద్యార్థులకు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా 22 భారతీయ భాషల్లో రాజ్యసభ సభ్యులు మాట్లాడేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి పెరగడం శుభపరిణామం అన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా మరింత పురోగతి జరగాలన్నారు.

- Advertisement -

దేశానికి ఆహార భద్రత అసరమని అయితే పౌష్టికాహార భద్రతను కల్పించనపుడు ఆరోగ్యకరమైన భారత్ తద్వారా సంక్షేమ భారత నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ దిశగా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహంతోపాటు ఈ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించినపుడు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాంభావు మాల్గి ప్రబోధిని సంస్థకు చెందిన ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్‌షిప్’ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement