హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువులోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు పనులు శరనేగంగా కొనసాగుతున్నాయి. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తూ ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. జులై నాటికి కరివెన, ఆగస్టు నాటికి ఉద్దండపూర్ ప్రాజెక్టుల ట్రయల్ రన్‌కు సిద్ధం చేస్తున్నారు. ఐదుదశల్లో ఎత్తిపోసే ఈ ప్రాజెక్టు తొమ్మిది పంపుహౌసుల పనులు దాదపుగా పూర్తయ్యాయి. కాలువల పనులు పూర్తి చేసిన అనంతరం ట్రయల్ రన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం తాగునీటి కోసం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నా సమాంతరంగా సాగునీటి పైపు లైను పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఏపీ గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదుచేయడంతో నిలిచిన పనులు సుప్రీంకోర్టు స్టేతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి.
అయితే తిరిగి సమస్యలు ఉత్పన్నం కాకుడా గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమగ్ర నివేదిక సమర్పించి అనుమతులు పొందేందుకు సాగునీటి పారుదల శాఖ ప్రయత్నిస్తున్నది. ఐదుదశల్లో ఒక రిజర్వాయర్ నుంచి మరో రిజర్వాయర్‌కు కృష్ణాజలాలను ఎత్తిపోసే ప్రక్రియలో భాగంగా పంప్ హౌసుల నిర్మాణం దాదాపుగా పూర్తి చేసి పవర్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టం వంటి కీలక నిర్మాణాలపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. ఏదుల, వట్టెం పంప్ హౌస్‌లకు సంబంధించిన రెండు పంపుహౌసుల పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు సిద్ధం చేశారు. మరో నాలుగు పంపులు జూన్ చివరినాటికి పూర్తికానున్నాయి. 6.40 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పనులు 98.7శాతం పూర్తి అయినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఉద్దండాపూర్ రిజర్వార్ మొదటి దశ పనుల్లో 77.19శాతం పూర్తి అయ్యాయి.
రెండవదశపనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రభుత్వం విధించిన గడువులోగా ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే మొదటి దశ ఆగస్టు నాటికి పూర్తి చేసినప్పటికీ రెండవ దశ పనులు 2024 ఫిబ్రవరి నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఏదుల- వట్టెం కాలువ పనులు 6.40 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి మరో నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తి కావల్సి ఉంది. సముద్రమట్టం నుండి 269.735 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి 5 దశల్లో నీరు ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టును పూర్తి చేసి మొదట నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి.
నార్లాపూర్‌లోని అంజనగిరి జలాశయం, ఏదులలోని వీరాంజనేయ జలాశయం, వట్టెంలోని వెంకటాద్రి జలాశయం, కరివెన జలాశయం ఉద్దండాపూర్ జలాశయాల్లోకి కృష్ణానది నీటిని ఎత్తిపోస్తారు. ఇప్పటికి దాదాపుగా మూడు జలాశయాల పనులుపూర్తి కాగా జులై నుంచి ఆగస్టులోగా కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలను పూర్తి చేసేందుకు అధికారులు పనుల్లో వేగం పెంచారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎం దృష్టి సారించడంతో నిర్దిష్ట గడపవులోగా పనులు పూర్తిచేసేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.