Thursday, November 21, 2024

Big Story | ల్యాండ్‌ పూలింగ్‌తో లాభమే.. ఉభయ తారకంగా ప్రభుత్వ యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వార్షిక ఏడాది ముగింపునకు చేరడంతో పన్నేతర ఆదాయాల దిశగా ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. తాజాగా గతంలో క్యాబినెట్‌ ఆమోదించిన ల్యాండ్‌ పూలింగ్‌ అంశాన్ని తెరపైకి తేనున్నది. పట్టణ ప్రాంతాల సమగ్ర ప్రణాళికాబద్ద అభివృద్ధి, ఆర్ధిక స్వయం ప్రతిపత్తితోపాటు ఆర్ధిక స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నది. 20 పట్టణాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ విధానంతో నగరపాలికలు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లో ఈ విధానం అమలుకు పూనుకుంటోంది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల్లో 21510 ఎకరాలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పద్దతిలో ప్రైవేటు భూములను సేకరించి ప్లాట్లుగా అభివృద్ధిపర్చి అందులోనుంచి ఎకరాకు 1200నుంచి 2వేల గజాల వరకు భూ యజమానికి ఇవ్వనున్నారు.

తద్వారా రూ.10వేల కోట్లను ఈ ఆర్ధిక ఏడాది ముగింపునాటికి సమీకరించుకునే ప్రయత్నాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు గత ప్రతిపాదనలను పున: పరిశీలన చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను సమీకరించి లే అవుట్లుగా అభివృద్ధిపర్చి అన్ని సదుపాయాలతో విక్రయించుకునేందుకు యోచిస్తున్నది. 2500 ఎకరాల్లో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూములను వెంచర్లుగా అభివృద్ధిపర్చి రూ.10వేల కోట్ల సాధనకు వ్యూహం ఖరారు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లనుంచి వివరాలను సేకరించింది.

సొంత లే అవుట్లు…

- Advertisement -

మరోవైపు ఇలా క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఈ ఏడాది పన్నేతర ఆదాయాల్లో భాగంగా భూముల అమ్మకాలతో రూ. 25,421కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు రూ. 8400కోట్ల రాబడే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.

రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్‌ కింద 2500ఎకరాలతో రూ. 10వేల కోట్లను పొందేలా ప్లాన్‌ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.

జిల్లాల వారీగా వెంచర్లు…

రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను డెవలప్‌చేసి రూ. వేల కోట్ల లక్ష్యం దిశగా రంగంలోకి దిగింది. గతేడాది కోల్పోయిన పన్నేతర ఆదాయా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నివేదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నది. తద్వారా రూ. 10వేల కోట్ల లక్ష్యం చేరేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది.

హెచ్‌ఎండీఏ లే అవుట్ల ప్లాట్ల వేలం ఈనెల 18న…

మరోసారి హెచ్‌ఎండీ అభివృద్ధి చేసిన లే అవుట్లలో పాట్ల ఆన్‌లైన్‌ వేలంతో భారీ రాబడికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 16దాకా స్వీకరించనున్నారు. ఆ తర్వాత లాటరీల ద్వారా ప్లాట్ల కేటాయింపులకు రంగం సిద్థం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల వేలంతో ఈ దఫా రూ. 6500కోట్ల ఆర్జనకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

ఇక జిల్లాల్లోనూ…

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు తీసుకున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ. 6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తోంది. ఒకవైపు భూముల విక్రయంతోపాటుగానే మరోవైపు గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement