హైదరాబాద్, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో భారాస ఒంటరిగా పోటీ చేస్తుందా..? పొత్తుతో ముందుకు వెళ్తుందా..? అని అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హ్యాట్రిక్ సాధించాలంటే కమ్యూనిస్టులతో కలిసే ముందుకు వెళ్తారని అధిష్టానం పెద్దలు చెబుతుండగా.. మరికొంత మంది సిట్టింగ్‌లు మాత్రం సింగిల్‌గా బరిలోకి దిగబోతున్నామని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ పార్టీ పోత్తులు పెట్టుకుంటే ఏ ఏ స్థానాలు వారికి కేటాయిస్తారని గుసగుసలాడుకుంటున్నారు. ఆయా స్థానాల్లోని సిట్టింగ్‌లు బయటికి గంభీరంగా ఫోజులు ఇస్తున్నా లోలోన అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ వెంటాడుతోంది. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పొత్తుతో ముందుకు వెళ్తారని సీఎం కేసీఆర్ వర్గం వెల్లడిస్తోంది.
యువనేత అనుచర గణం మాత్రం అసెంబ్లిd ఎన్నికల్లో పొత్తు లేనే లేదంటూ కుండ బద్దలు కొడుతున్నారు. వాస్తవానికి అధినేత సైతం పొత్తుపై ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలకు ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు. ఊహాగానాలతోనే పొత్తు ఉంటుందన్న చర్చ సాగుతోంది. కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రం ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో భారాస గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు.
ఆ తర్వాత వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో భారాసతో కలిసి పోటీ చేయబోతున్నట్లుగా కమ్యూనిస్టు నేతలు సమయం దొరికినప్పుడల్లా వెల్లడిస్తున్నారు. కానీ గులాబీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీలు, సందేశాలు, సూచనలు ఎక్కడా బహిర్గతం కాలేదు. చాలా సార్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా వారికి అధినేత ఇవ్వలేదని సమాచారం. పొత్తులపై ఏదో ఒక్కటి తేల్చండి.. మా దారి మేము చూసుకుంటామని గత నెల నుంచి సీపీఐ, సీపీఎం నేతలు బహిరంగంగానే స్వరం పెంచారు. ఇప్పటికి వారికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.
దక్షిణాది టార్గెట్‌గా అడుగులు
దక్షిణ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పొట్టుకోవచ్చా లేదా అన్న సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీపీఐ, సీపీఎం పార్టీల ఓటు బ్యాంకు పొత్తుతో బరిలోకి దిగితే గులాబీ వైపు మళ్లుతుందా..? అని కొంత మంది అగ్రనేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధినేత అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాలు ఇప్పటికీ గులాబీ కంచుకోటలుగా ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉన్నా కూడా కనీసం మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఊపును వాపుగా చూపించాలనే ప్రయత్నం కోసం సుదీర్ఘంగా రాజకీయ ఎత్తులపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లాభం ఎంత..? ఓట్ల శాతం ఎంత..?
గతంలో కమ్యూనిస్టులు ప్రతి ఎన్నికల్లో దాదాపుగా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో ఉంటూ వచ్చారు. ఓట్లు కూడా హస్తం వైపు మళ్లాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. ప్రాంతీయ పార్టీలలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో కలిసి వెళ్లినా పెద్దగా ఓటు బ్యాంకు తమకు పడకపోవడంతోనే ఓటమి చెందామని అప్పట్లో ప్రకటించారు. గత అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీతో కలిసి సీపీఐ, సీపీఎం పార్టీలో బరిలోకి దిగాయి. అయినా పెద్దగా ప్రభావం చూపించకపోవడంపై కూడా అధినేత కేసీఆర్ రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలతో కన్నా జాతీయ పార్టీలతోనే కమ్యూనిస్టులు ఎక్కువగా వెళ్తూ వస్తున్నారు. ఆ ఓటు బ్యాంకు కూడా జాతీయ పార్టీలకు మళ్లినంతగా ప్రాంతీయ పార్టీలకు రాలేదని గత ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రత్యేక తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఒక వేళ బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తు పెట్టుకుంటే అవి గులాబీ వైపు వచ్చే ఎన్నికల్లో ఎంత శాతం మళ్లుతాయన్న చర్చ అధినేత కేసీఆర్ చేసినట్లు తెలుస్తోంది.
క్లారిటీ ఇద్దాం..
భారాసతో కలిసి వెళ్లేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. పొత్తులో భాగంగా చెరి మూడు స్థానాలను కోరుతున్నాయి. కమ్యూనిస్టులు కోరుతున్న అన్ని స్థానాల్లోనూ గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురిని సర్థు బాటు చేసి కమ్యూనిస్టులకు ఇద్దామా..? వద్దా అన్న సందిగ్ధంలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌కు ఎంత శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఏఏ స్థానాల్లో వారితో పొత్తు కలిసి రానుంది. పొత్తు లేకపోతే ఓడిపోయే స్థానాలు ఎన్ని..? ఇలా అధినేత కేసీఆర్ లాభ, నష్టాలను భేరీజు వేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొన్నటి వరకు 2 ప్లస్ 2 అంటే మూడు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎమ్మెల్సీ ఇద్దామని అనుకున్నా.. కమ్యూనిస్టులు వాటికి అంగీకరించరని పొత్తు వద్దన్న సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కొంత మంది దక్షిణ తెలంగాణకు చెందిన ప్రముఖ నేతలు పొత్తుపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ నెల చివరి లోపు పొత్తులపై ఓ క్లారిటీని అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.