Friday, November 22, 2024

కాలుష్యంపై చట్టప్రకారమే ముందుకెళ్లండి.. అమర్ రాజా బ్యాటరీస్ కేసులో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌కు చెందిన అమర్ రాజ్ బ్యాటరీస్ సంస్థ కాలుష్యం కేసులో చట్టప్రకారం ముందుకెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్యం నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై చట్టప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై అభ్యంతరాలుంటే వాటిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన ‘స్టే’ను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే అమరరాజా కంపెనీ మూసివేతపై హై కోర్ట్ ఇచ్చిన ‘స్టే’ ఆదేశాలను సుప్రీంకోర్టు కొనసాగించింది. కేసు విచారణ సందర్భంగా అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంత జలాల్లో ‘లెడ్’ స్థాయి తీవ్రంగా పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

- Advertisement -

అమర్ రాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని, 34 పర్యాయాలు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై చట్టం ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలిపి వేయాలని, ఆ నాలుగు వారాల్లో అవసరమైతే న్యాయ పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement