Tuesday, November 26, 2024

TG | ధరణి పోర్టల్‌లో స‌మ‌స్య‌లకు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో సతమవుతూ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఈ పోర్టల్‌తో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, గృహ (హౌసింగ్‌), సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తాను స్వయంగా ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. శుక్రవారం డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌ కుమార్‌, మధుసూదన్‌లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ (ధరణి) ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, ధరణి పోర్టల్‌ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ చేసిన సిఫారసులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేకంటే ముందు అన్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

- Advertisement -

ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని ఆర్‌వోఆర్‌ చట్టాన్ని (యాక్ట్‌ను) క్షుణ్ణంగా పరిశీలించిందని భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

లోపభూయిష్టమైన 2020 ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్‌ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్‌లో మార్పులు-చేర్పులు చేపట్టబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పార్ట్‌-బీలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement