Friday, November 22, 2024

నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. నార్లాపూర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి

కొల్లాపూర్ – తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. ఎదురెక్కి రానున్న కృష్ణమ్మకు జలహారతి పట్టనున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్‌ వేదిక కానున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించిన పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌కు చేరుకొంటారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేయనున్నారు. అనంతరం లిఫ్ట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్‌ చేస్తారు. అక్కడే సర్జ్‌పూల్‌, పంప్‌హౌస్‌ను పరిశీలించి, అక్కడి నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్‌ వద్ద డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు. అనంతరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇరిగేషన్‌ ఉన్నతాధికారులను అభినందించనున్నారు. అనంతరం ఉన్నతాధి కారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన మూడు రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రక్రియను అడిగి తెలుసుకొంటారు. అనంతరం కొల్లాపూర్‌ సభా వేధిక వద్దకు చేరుకుంటారు.

ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్‌హౌస్‌, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటర్ల బిగింపు కొనసాగుతుండగా.. ఇప్పటికే రెండు మోటర్లు నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించగా విజయవంతమైంది. అందులో భాగంగా నేడు జలాల ఎత్తిపోతలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement