కరోనా కారణంగా భారత్ రక్తమోడుతోందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక చోప్రా తాజాగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. దేశంలో కొవిడ్ రోజురోజుకీ విజృంభిస్తోందని..దానివల్ల ఆసుపత్రులు సైతం కరోనా బాధితులతో నిండిపోయాయని.. సరైన చికిత్స దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా ప్రతిఒక్కరూ తమకు తోచినంత సాయం చేయాలని కోరుతూ ఫండ్‌రైజర్ క్యాంపు గురించి వివరించారు.
నేను ప్రస్తుతం లండన్‌లో ఉన్నాను. కానీ, భారతదేశంలో ఉన్న క్లిష్టపరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు నా కుటుంబం, స్నేహితుల నుంచి వింటూనే ఉన్నాను. కొవిడ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఐసీయూలు సైతం ఖాళీ లేని పరిస్థితులున్నాయి. ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్య కూడా తీవ్రంగా ఉండటంతో మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. భారతదేశం నా పుట్టినిల్లు. ప్రస్తుతం భారత్ రక్తమోడుతోంది. ఒక గ్లోబుల్ కమ్యూనిటీగా ఇప్పుడు మనమే దేశానికి సాయం చేయాలి. భారత్‌కు ఇప్పుడు మీ అవసరం ఉంది. మీకు ఉన్నదానిలో సాయం చేయండి’ అని ప్రియాంక తెలిపారు.