నష్టాల పేరుతో ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మేసిన ప్రభుత్వం ప్రస్తుతం దాని అనుబంధ సంస్థల ప్రవేటీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐఏఎస్‌ఎల్, ఏఐఈఎస్‌ఎల్ సంస్థలను ప్రవేటీకరించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న పెట్టుబడిదారులతో చర్చలు ప్రారంభించింది. దీనిపై త్వరలోనే ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వాంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టాలు వస్తున్నాయని ఎయిర్‌ఇండియాను ప్రభుత్వం టాటా గ్రూప్‌కు 18 వేల కోట్లకు అమ్మేసింది.
ఎయిర్‌ఇండియాకు అనుబంధంగా ఎయిర్‌ఇండియా ఎయిర్‌పోర్టు సర్వీసెస్(ఏఐఏఎస్‌ఎల్), ఎయిర్‌ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) , అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏఏఏఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌సీఎల్) అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. వీటితో పాటు ఇతర నాన్ కోర్ అస్సెట్స్ కూడా ఉన్నాయి. ఎయిర్‌ఇండియా అమ్మకం డీల్‌లో ఇవన్నీ భాగంగా లేవు. 15 వేల కోట్ల విలువైన నాన్ కోర్ అస్సెట్స్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్‌ఎల్)కు ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది.
ఎయిర్ ఇండియాకు 61,562 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో15,300 కోట్ల అప్పుల బాధ్యత టాటా గ్రూప్ తీసుకుంది. మిగిలిన 46 వేల కోట్ల రుణ భారాన్ని ఏఐఏహెచ్‌ఎల్ తీసుకుంది. ఈ రుణాలు తీర్చేందుకు నాన్ కోర్ ఆస్తులను అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దీపమ్ ఏఐఏఎస్‌ఎల్, ఏఐఈఎస్‌ఎల్ ప్రవేటీకరణకు కసరత్తు ప్రారంభించారు.