హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమాన చార్జీ రూ.3600. ప్రయి వేటు బస్సుల్లో అయితే ఏకంగా రూ.4050 వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. సగటు ఉద్యోగి హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రానుపోను ఛార్జీలు, దారి ఖర్చులు కలుపుకుంటే రూ.20 వేల వరకు ఖర్చవు తోందని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది పండుగను ఇక్కడే జరుపుకుని వీలుంటే ఎప్పుడైనా స్వగ్రామానికి వెళదామన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న దసరా పండగ ఉండడంతో ప్రయివేటు ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాదారణ రోజులతో పోలిస్తే పండుగకు ఊరెళ్లాలంటే 150 శాతం నుంచి 250శాతం బస్సు ఛార్జీలు పెంచారు. టికెట్ల ధరలు భారీగా పెంచి ప్రయాణికులను దోపీడీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఏసీ స్లీపర్ కోచ్ టికెట్ ధరను సగటున రూ. 500 నుంచి రూ.600, ఏసీ బస్సుల్లో ధరను రూ.400 నుంచి రూ.500, నాన్‌ఏసీ స్లీపర్‌లో రూ.500 ఇలా ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేసి ప్రయాణికులను గడగడ లాడిస్తున్నారు. ప్రయివేటు ట్రావెల్స్‌పై నిఘా పెట్టాల్సిన రవాణాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లతోపాటు సాధారణ రైళ్లలో రెండు నెలల క్రితమే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఆర్టీసీ బస్సు ల్లోనూ పరిస్థితి ఇదే. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతోపాటు ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారిలో ఎక్కువగా ఏపీకి చెందినవారే ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఈ పండగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700 వరకు వసూలు చేస్తుండగా పండగ పుణ్యమా అని ఈ ఛార్జీని కాస్తా రూ.1500కు పెంచేశారు. అలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాధారణ రోజుల్లో రూ.1500 వసూలు చేస్తుండగా ఇప్పుడు ఆ ఛార్జీని ఏకంగా రూ.4 వేలకు పెంచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. విమాన ఛార్జీలతో పోటీపడి బస్సు ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చుంటున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఛార్జీలను వసూలు చేస్తుండడంతో చేసేదేమి లేక టికెట్లను కొనుగోలు చేస్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు వెళ్లాలంటే ఓ కనీస ఉద్యోగి నెల జీతం ప్రయివేటు ట్రావెల్స్‌కు సమర్పిం చాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 30వరకే ఈ ఛార్జీలు అమలులో ఉంటాయని, ఒకటో తేదీ నుంచి పెరుగుతాయని ట్రావెల్స్ సిబ్బంది చెబుతుండడంతో ప్రయాణికులు ఉరుకులు, పరుగులతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విమాన ఛార్జీలా..? బస్సు ఛార్జీలా..? అంటూ నిర్ఘాంత పోతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు ఆర్టీసీ యాజమాన్యం, దక్షిణ మధ్య రైల్వే బస్సులను, రైళ్లను నడిపితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రయివేటు ట్రావెల్స్ దోపీడీకి అడ్డుకట్ట పడేదని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.