కరోనా చికిత్సలో భాగంగా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే ఆస్పత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కవ వసూలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అమలు తీరు, బిల్లుల వసూలు అంశంపై వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు.
కొన్ని చోట్ల కరోనా బాధితుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఆస్పత్రులకు భారీగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు మానవతావాదంతో వ్యవహరించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు మెరుగైన వైద్యం అందించి సహకరించాలని కోరారు.