Thursday, November 21, 2024

ధాన్యంలో ప్రై ‘వేటు’

ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటు మార్కెట్‌ రాజ్య మేలుతోంది. దీంతో వ్యాపారులు చెప్పిందే ధర, ఇచ్చిందే రేటు అన్నట్టు తయా రైంది పరిస్థితి. కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండడంతో కేంద్రాలకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానాకాలం కొనుగోళ్లలో ధాన్యం అంశంపై గందరగోళ పరిస్థితులు నెలకొనగా, మరోవైపు మాత్రం మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులే కొను గోలును నిర్ణయిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు కేంద్రాలకు కొంత మంది మిల్లర్లే వెళ్లి ధాన్యాన్ని పరిశీలించుకుని ఆ ధాన్యాన్ని మాత్రమే పంపించాలని కేంద్రాల వద్ద ఉన్న ఇన్‌ఛార్జీలకు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రైవేటర్లు 75కేజీల బస్తాలో తూకం వేస్తూ ధరను నిర్ణయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 54లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.11 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమకాగా, మరో రూ.5 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో 2,500 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తికావడంతో మూసివేసారు. చలితో తేమ సమస్య.. ఇపుడే ప్రారంభమవుతున్న కోతలు.. వడ్ల కొనుగోలులో తేమ సమస్య రైతులను వేధిస్తోంది. కొనుగోలుకు ముందు నిబంధనలకు అనుగుణంగా వస్తున్న తేమ శాతం తీరా కొనుగోలుకు వచ్చాక పరిశీలిస్తే ఎక్కువ వస్తుండడంతో అధికారులు కొనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. రోజురోజుకు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండ డంతో తేమ సమస్య మరింత జటిలం అవుతుందని రైతులు అంటున్నారు. ఉదయం 10గంటలకు ఆరబోస్తున్న ధాన్యా న్ని కొనుగోలు కాకపోవడంతో మళ్లి సాయంత్రం మంచుకు తడవకుండా కుప్పగా వేయాల్సి వస్తోంది. ఏరోజుకారోజు ఇలాగే జరుగుతుందని, కానీ కొనుగోలు మాత్రం కావడం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు సంఘం నేత అన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వరిని సాగుచేయడంతో ఇపుడిపుడే కోతలు ప్రారంభమవుతు న్నాయి. దీంతో ఇపుడు కోతలు కోస్తున్న ధాన్యంలో తేమ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండడంతో కొనుగోలు ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement