Friday, November 22, 2024

ప్రధాని మాటలు నాలో స్ఫూర్తినింపాయి : బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌..

న్యూఢిల్లి: వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీని మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు, ఆయన చెప్పిన మాటలు నాలో స్ఫూర్తినింపాయని తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పేర్కొన్నారు. ప్రధాని స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని పతకాలు గెలవాలనే పట్టుదల నాలో పెరిగిందని, ఆ లక్ష్యసాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని నిఖత్‌ పేర్కొన్నారు. శనివారంనాడిక్కడ ఓ న్యూస్‌ ఏజెన్సీతో వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ బంగారు పతకం విజేత నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడం అత్యుత్తమ క్షణాలలో ఒకటి. దానిని తాను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు.

ప్రతి పతకం గెలిచిన తర్వాత ఆయనను కలవాలనుకుంటున్నానని బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తెలిపారు. ఇటీవల ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ టోర్నీలో 52 కేజీల విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ జుటామాస్‌పై సునాయాసంగా గెలుపొంది, పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. స్ట్రాండ్జా మెమోరియల్‌ టోర్నీలో నిఖత్‌ జరీన్‌ రెండుసార్లు బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. ప్రధాని మోడీతో సమావేశమైన ఆ ఉద్విగ్న క్షణాలను నిఖత్‌ జరీన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ”అదొక అద్భుతమైన అనుభవం, నా జీవితంలో ఆ క్షణాలను నేనెప్పుడూ ఆదరిస్తాను. ప్రధానమంత్రితో సమావేశానికి ముందు చాలా ఉద్వేగానికి లోనయ్యా. కానీ ప్రధాని వ్యవహరించిన తీరు, ఓ కుటుంబంలో సభ్యులు మాట్లాడుకునేలా సంభాషించారు. ఎలా ప్రిపేర్‌ అవ్వాలి. ఏ దేశానికి చెందిన బాక్సర్‌తో పోటీ పడటం కష్టం వంటి ప్రతి విషయాన్ని ప్రధాని వివరంగా అడిగారు. ప్రధానితో జరిగిన మొత్తం సంభాషణ జీవితాంతం గుర్తుండిపోయంది” అని నిఖత్‌ జరీన్‌ చెప్పారు. తాను ప్రధానితో సెల్ఫీ తీసుకోవాలనుకున్నా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ బంగారు పతకం గెలించిన తర్వాత అవకాశం నాకు వచ్చింది. నేను అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని కోరుకుంటున్నా, ఆ లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలు మొదలెట్టాననని నిఖత్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement