న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి చేపట్టిన పర్యటనలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును రావొద్దంటూ ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సహాయ మంత్రి (ప్రధాని కార్యాలయం) డా. జితేంద్ర సింగ్, ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, ప్రధాని కార్యాలయం అలాంటి మెసేజ్ ఏదీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఫిబ్రవరి 5 నాడు జరిగిన ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని భావించామని, కానీ అనారోగ్య కారణాలతో ఆయన రాలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చిందని గుర్తుచేశారు. సాధారణంగా రాజకీయ ఆరోపణలు, విమర్శలపై ప్రధాని కార్యాలయం స్పందించదు.
అలాంటివేమైనా ఉన్నా, పార్టీ కార్యాలయం నుంచి నేతలు కౌంటర్ అటాక్ చేస్తుంటారు. కానీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం నుంచి ఏకంగా సహాయ మంత్రే స్పందించడం దేశంలోని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ సహా కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో ప్రధాని కార్యాలయం నుంచి వివరణనిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..