Saturday, November 23, 2024

Delhi | ఏపీకి చెందిన సహకార సంఘానికి ప్రధాని ప్రశంస.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన మోదీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యవసాయ సహకార సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది. సోమవారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని, ఏపీలోని నంధ్యాలకు చెందిన ఖ్వాజా మోహియుద్దీన్‌తో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1921లో ఏర్పడిన ఆ సహకార సంఘంలో పనిచేస్తున్న మొహియుద్దీన్.. తమ పనితీరు గురించి ప్రధానికి వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తమకు నాబార్డు ద్వారా వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ. 3 కోట్ల రుణం అందిందని, ఆ డబ్బుతో తాము అత్యాధునిక సదుపాయాలతో 5 గోదాములు నిర్మించామని మొహియుద్దీన్ చెప్పారు.

రైతులు తమ పంటలను ఈ గోదాముల్లో నిల్వ చేసుకుంటారని, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌజ్ రసీదులు అందిస్తున్నామని తెలిపారు. ఆ రసీదులను ష్యూరిటీగా పెట్టుకుని బ్యాంకులు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయని వివరించారు. అలాగే గోదాముల్లో నిల్వ చేసిన రైతుల పంట దిగుబడిని దేశంలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేసి మెరుగైన ధరలు రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఈ-నామ్’, ‘ఈ-మండీ’ వ్యవస్థలను ఉపయోగించుకుని ఆయా పంటలకు దేశంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ విక్రయిస్తున్నామని వెల్లడించారు.

తద్వారా మధ్యవర్తులు, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు నేరుగా ప్రయోజనం కల్పిస్తున్నామని అన్నారు. తమ సహకార సంఘంలో రైతులు, మహిళా రైతులతో పాటు చిరువ్యాపారులు కూడా ఉన్నారని, మొత్తం కలిపి 5,600 మంది సభ్యులని ఖ్వాజా మొహియుద్దీన్ తెలిపారు. ప్రభుత్వం అందజేసే సదుపాయాలను మెరుగ్గా వినియోగించుకుంటూ రైతులకు మంచి ధర అందించేలా చూస్తున్న సహకార సంఘాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ఈ తరహా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్ గురించి కూడా ప్రధాని చెప్పారు. ఆయన గురించి తాను కొంత తెలుసుకున్నానని, ఆయన కృషి అభినందనీయమని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement