యూపీలోని వారణాసికి చెందిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా మృతులను గుర్తుచేసుకుని ప్రధాని బాధపడ్డారు. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. రెండో దశలో కరోనా కోసం బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోందని, బాధితులు ఎక్కువ సమయం ఆస్పత్రుల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని మోదీ అన్నారు. ప్రజలు క్షేమంగా ఉంటేనే వైద్య వ్యవస్థపై తక్కువ ఒత్తిడి ఉంటుందన్నారు.
అటు కరోనా నుంచి చిన్నారులను రక్షించుకోవాలని, గతంలో పిల్లలపై ప్రభావం చూపిన పలు వ్యాధులపై విజయం సాధించామని మోదీ గుర్తుచేశారు. చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా ఉత్తమమైన పద్ధతులను వాడాలని వైద్యులకు సూచించారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, దానిని కట్టడి చేసేందుకు వీలుగా వ్యవస్థను సిద్ధం చేయాలని తెలిపారు. కాగా పలు రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దానిని అంటువ్యాధిగా ప్రకటించాలని గురువారం నాడు కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.