ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 21న పోలాండ్, 23న ఉక్రెయిన్‌లో మోడీ పర్యటించనున్నారు. ఆగష్టు 21న పోలాండ్‌లో ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. పోలాండ్ నుంచి 23వ తేదీన మోడీ.. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారు.
ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు. 23న మోడీ-జెలెన్‌స్కీ మధ్య భేటీ ఉండనున్నది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీకి ఇదే తొలి పర్యటన.
గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ- అయిన నెల రోజుల తర్వాత ఉక్రెయిన్‌లో మోడీ పర్యటిస్తుండటం విశేషం. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించాయి. అయితే మన దేశం ఇప్పటికీ రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు నెరపుతూ వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి.