హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం. దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్-విజయవాడ మార్గాల్లో నడపనున్నారు. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకు ఏడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభానికి నోచుకోగా ఎనిమిదో ఎక్స్‌ప్రెస్ రైల్ తెలంగాణలో ప్రారంభం కానుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. సికింద్రాబాద్-విజయవాడ రూట్‌లో ట్రాక్ సామర్ధ్యాన్ని ఇటీవలే పెంచారు. ఆ తర్వాత వందే భారత్ ఎక్సప్రెస్ ట్రయల్ రన్ నడుస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఏడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆయనే స్వయంగా ఈ రైళ్లను ప్రారంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పర్యటించనున్నారని భావిస్తున్నారు.
ఈ నెల సంక్రాంతి పర్వదినం తర్వాత 19 లేదా 20 తేదీలలో హైదరాబాద్‌కు ప్రధాని మోటీ రావొచ్చని అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ స్టేషన్‌నుంచే ఆయన జాతినుద్దేశించి ప్రసంగించేందుకు కూడా యోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం న్యూఢిల్లి -వారణాసి, న్యూఢిల్లి-శ్రీమాతా వైష్ణో దేవీ కాట్రా, న్యూఢిల్లి-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, మైసూర్-చెన్నై, జలాన్‌పూర్-నాగపూర్, హౌరా-న్యూజల్పాయ్‌గురి రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాటికి 75 వందే భారత్ రైళ్లను నడిపే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. 52 సెకండ్లలో గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకునే రైలు గంటకు 200కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వైఫై హాట్ స్పాట్ల వంటి అధునాతన సౌకర్యాలు ఈ రైలులో ఉంటాయి.