ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 6న పుణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. మెట్రో రైల్ ప్రారంభంతో మెట్రో రైలు సేవల కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్ధాపనలు చేయనున్నారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు.
ఇక 11.30 గంటలకు పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్ను ప్రారంభిస్తారు. మెట్రో రైలు రాకతో పుణేలో అర్బన్ మొబిలిటీ కోసం అంతర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్ 24న ప్రధాని మోదీ శంకుస్ధాపన చేశారు. పుణే మెట్రో మొత్తం 32.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మితమవుతుండగా 12 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించనున్నారు. రూ 11,440 కోట్లకు పైగా నిధులతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకూ ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు.