108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ను రేపు (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. తుకాడోడీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వ విద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంవత్సరం మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశం ఐఎస్‌సి ప్రధాన ఇతివత్తంగా ఉంటోంది. సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత సాధనలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల సహకారాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొంది. సదస్సులో పలువురు మహిళా శాస్త్రవేత్తలు ఉపన్యాసాలతోపాటు ఐఎస్‌సి ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి.
పిల్లల్లో శాస్త్రీయ ఆసక్తి, స్వభావాన్ని పెంపొందించడానికి బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహించబడుతుంది. బయో ఎకానమీని మెరుగు పరచడానికి, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడానికి రైతు సైన్స్ కాంగ్రెస్ ఒక వేదికను అందిస్తుందని పీఎంవో ప్రకటన తెలిపింది. అదేవిధంగా గిరిజన మహిళల సాధికారతపై దృష్టిసారించడంతో పాటు దేశీయ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ, అభ్యాసాల శాస్త్రీయ ప్రదర్శనకు గిరిజన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ మొదటి సదస్సు 1914లో జరిగింది.