కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాపిడ్ టెస్ట్ లకు బదులుగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలకు చేయాలని, అలాగే ఆ పరీక్షలను భారీగా పెంచాలని సీఎంలను కోరారు.
మైక్రో కంటైన్మెంట్ జోన్స్ వ్యవస్థను పునరుద్దరించాలని, గతంలో ఈ విధానంతోనే మనం విజయం సాధించినట్లు ప్రధాని ముఖ్యమంత్రులకు తెలిపారు. కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కనిపెట్టాలని వారిని కలిసిన వారికి కూడా పరీక్షలు చెయ్యాలని కోరారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుండా, ఇబ్బందులు పెట్టకుండా ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడాలని సూచించారు. వ్యాక్సినేషన్, టెస్టులపై ఎవ్వరూ కూడా అశ్రద్ధ చూపకుండా ఉండాలని కోరారు.
అయితే… ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో విలువైన వ్యాక్సిన్స్ ఎందుకు వృధా అవుతున్నాయో ఈ రాష్ట్రాలు సమీక్ష చేసుకోవాలని, ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉందని సీఎంలతో సమావేశంలో వ్యాఖ్యానించారు.