Tuesday, November 26, 2024

ఫిబ్రవరి 13న తెలంగాణకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్‌ తాజాగా ఖరారైంది. ఫిబ్రవరి 13 న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. తెలంగాణకు వస్తున్న ప్రధానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పీఎంవో సికింద్రాబాద్‌ రైల్వే అధికారులతోపాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం పంపించింది.

తెలంగాణ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రూ.3069 కోట్లతో పలు పనులకు భూమి పూజ చేయనున్నారు. కాజీపేటలో రూ.521 కోట్లతో రైలు పీరియాడిక్‌ ఓవరాలింగ్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌-చించోళి రహదారి విస్తరణకు, నిజాంపేట, నారాయణకేడ్‌, బీదర్‌ సెక్షన్‌లో మరో జాతీయ రహదారికి రూ.513 కోట్లతో శంకుస్తాపన చేయనున్నారు. ఇక రూ.4వేల కోట్లతో నిర్మించిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

ఇందులో ఇప్పటికే వందే బారత్‌ రైలును ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ను, ఐఐటీ హైదరాబాద్‌లోని పలు భవనాలను ప్రధాని ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ నెల 19 తారీఖునే తెలంగాణకు ప్రధాని మోడీ రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల కారణంగా వాయిదా పడింది.

- Advertisement -

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ…

అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలం గాణ కు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం లేదని ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌, సీఎంలు ఆరోపించిన నేపథ్యంలో బహిరంగ సభ ద్వారా ప్రధాని మోడీ ఏం మాట్లాడనున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని బహిరంగసభ ను రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణానికి ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement