హన్మకొండ : మహమ్మద్ ప్రవక్తపై బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో అంతర్జాతీయ దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని, దీనిపై దేశ ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసాయని, దీంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని, దేశానికి ఆర్థికంగా, వాణిజ్య పరంగా తీవ్ర నష్టం కలిగించే ఈ అంశంపై ప్రధాని తక్షణమే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. అలీన విదేశాంగ విధానాన్ని తీసుకువచ్చిన మన దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత స్పష్టమైన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం లేదని, ఇప్పటికైనా మతాలకతీతమైన వ్యవస్థను ఆచరించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ రాజ ద్రోహం కేసులు పెడుతున్నారని, ఇలాంటి దాడులను మోడీ ఇప్పటికైనా ఆపాలని అన్నారు. మరోవైపు దేశంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మడమే మోడీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్న దని, కార్పరేట్ శక్తులకు ఎంత మేలు చేస్తే ప్రజలకు అంత నష్టం జరుగుతుందని అన్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తామంటున్నారని, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బిజెపి నాయకులు ఏం ముఖం పెట్టుకొని సమావేశాలకు హాజరవుతారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయలేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ రాలేదని, పైగా నదీ జలాల బోర్డులు పెట్టి తెలంగాణాకు అన్యాయం చేసారని అన్నారు. విభజన హామీల అమలు కోసం సిపిఐ మొదటి నుండి పోరాడుతున్న దని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయనందునే భూ పోరాటాలు కొనసాగుతున్నాయని, గుడిసెలు లేని వరంగల్ ను చేస్తామన్న మాట కేసిఆర్ నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు కబ్జా చేస్తుంటే వాటిని అడ్డుకుని పేదలు గూడు కోసం ఎర్ర జెండా అండతో గుడిసెలు వేసుకుంటున్నారని అన్నారు. నివాస స్థలాలు రాజ్యాంగ హక్కు అని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదలకు గూడు, నీడ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. జీవో 58 ప్రకారం తక్షణమే పేదల నివాస స్థలాలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ధనవంతులకు ఊడిగం చేయడానికి కాదని, ఇప్పటికైనా కేసిఆర్, కెటిఆర్ కళ్లు తెరవాలని అన్నారు. కాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచార ఘటనను సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అలాగే గ్రామాలలో సర్పంచే లు అప్పులు చేసి పనులు చేసారని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సర్పంచ్ ల పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement