Friday, November 22, 2024

జూలై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ప్రధాని మోడీ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజకీయాలలో గత కొంత కాలంగా దూకుడుతో వెళ్తున్న బీజేపీ ఇటీవల కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో ఎదురీతను ఎదుర్కొంటోంది. తిరిగిలేని శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఎదురవుతున్న సవాళ్ళన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టడంతో పాటు తెలంగాణపై జాతీయ పార్టీ వైఖరిని మరింత తేటతెల్లం చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హెటెక్స్‌ వేదికగా జూలై 2, 3 తేదీలలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలను తమకు పూర్తి అనుకూలంగా మలచుకునేందుకు పార్టీ రాష్ట్ర నేతలు సన్నద్దమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజున సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని సంకల్పించిన కమలనాథులు సక్సెస్‌ చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బండి సంజయ్‌ రెండవ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభ సక్సెస్‌తో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్న పరేడ్‌ గ్రౌండ్‌ సభకు అంతకు రెండు మూడింతల రెట్టింపు జన సమీకరణ జరిపి ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్‌ విసరాలని రాష్ట్ర నాయకత్వం పని చేస్తోంది.

ప్రధాని సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని నిర్ణయించిన నాయకత్వం నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను కూడా నియమించింది. పార్టీ టికెట్‌ను ఆశించని వారికి నియోజకవర్గాలలో జన సమీకరణ బాధ్యతలను కట్టబెట్టారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ ప్రధాని బహిరంగసభపై చర్చకు పెట్టేలా కార్యాచరణను సిద్దం చేశారు. మోడీ సభ ద్వారా తెలంగాణ పట్ల పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు అధికారాన్ని అప్పగిస్తే చేసే అభివృద్ధిపై కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణకు కేటాయించిన నిధులు, ఇచ్చిన ప్రాధాన్యతను సభ ద్వారా మరోసారి ప్రజల ముందుంచనున్నారు. ప్రధానితో పాటు ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాలలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, ప్రజలకిచ్చిన హామీలను ఏకరువు పెట్టడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేదల కోసం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

కీలక నేతలతో కిషన్‌రెడ్డి భేటీ….

జూలై 2, 3 తేదీలలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేతలకు అప్పగించిన బాధ్యతలు తదితర అంశాలపై ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అదే విధంగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఒకటి రెండు రోజులలో కేంద్ర రక్షణ శాఖ అధికారుల నుంచి గ్రౌండ్‌ క్లియరెన్స్‌ అనుమతులు రాగానే వేదిక ఏర్పాట్లతో పాటు పార్కింగ్‌ తదితర సౌకర్యాలపై రాష్ట్ర అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డితో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్‌రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్‌కుమార్‌, కోశాధికారి శాంతికుమార్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్‌ వెంకటస్వామి, తమిళనాడు పార్టీ సహ ఇంచార్జీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ బాధ్యులతో సంజయ్‌ భేటీ..

- Advertisement -

పరేడ్‌ గ్రౌండ్‌ సభకు కనీవిని ఎరుగని విధంగా ప్రజలను తరలించాలన్న సంకల్పంతో ఉన్న పార్టీ నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియోజకవర్గ ఇంచార్జీలతో భేటీఅయి జన సమీకరణతో పాటు రెండు రోజుల పాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగనున్న మోడీ సభపై గ్రామాల్లో విస్తృత చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి కనీసం 100 మందిని సికింద్రాబాద్‌ సభకు తరలించేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement