కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై మండిపడ్డారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో ప్రధాని మోదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కరోనా నేపథ్యంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కనిపించకుండాపోయారని, మనకు మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మోదీ ఫొటోలేనని విమర్శించారు.
కోవిడ్ రోగులు ఆక్సిజన్, మందులు అందుబాటులో లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారని రాహుల్ గాంధీ ప్రతిరోజూ ఓ ట్వీట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసేందుకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవని, కోవిడ్ రెండో వేవ్ కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ గురువారం చేసిన ట్వీట్‌లో, ‘వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాన మంత్రి కూడా కనిపించడం లేదు. ఇక మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మందులపై జీఎస్‌టీ, అక్కడా ఇక్కడా ప్రధాన మంత్రి ఫొటోలు మాత్రమే’ అని రాహుల్ పేర్కొన్నారు.