Tuesday, November 26, 2024

మోడీని లోక్ స‌భ టీవీలో ప‌ని చేస్తారన్న చిన్నారి-న‌వ్విన ప్ర‌ధాని

ఓ చిన్నారి ప్ర‌ధాని మోడీని లోక్ స‌భ టీవీలో ప‌ని చేస్తార‌ని అన‌డంతో మోడీ పెద్ద‌గా న‌వ్వేశారు. తన తండ్రి బిజెపి ఎంపీ అయిన అనిల్ ఫిరోజియా వెంట పార్లమెంటుకు వచ్చిన చిన్నారి ప్రధాని మోదీని కలిసింది. చిన్నారిని దగ్గరకి తీసుకున్న ప్రధాని తానెవరో చెప్పమని అడిగారు. మోడీ అని చిన్నారి కరెక్ట్ గానే చెప్పింది. ఆ తరువాత తాను ఏం చేస్తుంటానో చెప్పమని మోడీ అడిగారు. ‘మీరు లోక్ సభ టీవీలో పనిచేస్తుంటారు కదా’ అని ఆ చిన్నారి రిప్లై ఇచ్చింది. దీంతో మోడీ గట్టిగా నవ్వేసారు. ఆ తర్వాత మోడీ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పంపించారు. అనిల్ ఫిరోజియా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అనిల్ ఫిరోజియాకు కిలోబరువు తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున నియోజక వర్గానికి నిధులు ఇస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో రూ. 5,772 కోట్ల విలువైన 11 రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద 534 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కోరుతున్న ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఒక సవాల్ విసిరారు. నేను నూట ముప్పై ఐదు కేజీల నుంచి 93 కేజీలకు బరువు తగ్గాను. ఇప్పుడు నీకు ఒక షరతు పెడుతున్నాను. నువ్వు కిలో చొప్పున బరువు తగ్గితే, ఉజ్జయినీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తాను. నువ్వు బరువు తగ్గు. ఎలా తగ్గాలో కూడా నేను చెబుతా అన్నారు. దీంతో నూట ఇరవై ఐదు కేజీల బరువున్న ఉజ్జయిని బిజెపి ఎంపీ అనిల్ ఫిరోజియా గడ్కరీ ఆఫర్ ను సవాలుగా స్వీకరించారు. తన ఆరోగ్యంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం బరువు తగ్గడం మీద సీరియస్ గా దృష్టి సారించారు. ఆహార ప్రణాళికతో పాటు, శారీరక వ్యాయామం, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేసి 21 కిలోల బరువు తగ్గడంతో ఆయన నియోజకవర్గానికి 21 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement