ఢిల్లీ: ఉక్రెయిన్‌పై ఏడాదికి పైగా రష్యా సాగిస్తున్న యుద్దం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమ దేశాలు చేసిన ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ తోసిపుచ్చారు.. తాము శాంతి వైపే ఉన్నామని చెప్పారు. అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
”మేం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామని కొంతమంది అన్నారు. కానీ మేం తటస్థం కాదు. శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలి. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేగానీ యుద్ధంతో కాదు” అని మోడీ తెలిపారు.
సమస్య పరిష్కారం కోసం రష్యా , ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్, జెలెన్స్కీతో తాను పలుమార్లు మాట్లాడినట్లు ప్రధాని గుర్తుచేశారు. ”భారత్ ఏం చేయగలదో అన్నీ చేస్తోంది. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలను మేం సమర్థిస్తున్నాం” అని మోడీ తెలిపారు.
ఇక, భారత్-చైనా మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ”ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత, నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో, భారత్ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంది” అని మోడీ వ్యాఖ్యానించారు.కాగా ప్రధాని మోడీ నేడు అమెరికా పర్యటనకు బయల్దేరారు. రేపటి నుంచి ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఐరాసలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకలకు ఆయన నేతృత్వం వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. అనంతరం ఆయన ఈజిప్ట్ పర్యటనకు వెళ్లనున్నారు..