Sunday, November 17, 2024

జులై 2న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని వెూడీ.. బేగంపేట టూ హెచ్‌ఐసీసీకు వెూడీ రోడ్‌షో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల విజయవంతానికి ఆ పార్టీ జాతీయ నాయకులు రంగంలోకి దిగారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అధ్యక్షతన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సహా 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరవుతుండడంతో ఏర్పాట్లను కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్‌ వేదికగా నిర్వహించడం తొలిసారి కావడంతో నగరాన్ని పూర్తి స్థాయిలో పార్టీ జెండాలు, కటౌట్లతో కాషాయమయం చేయాలని ప్రతిపాదించారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రత్యేక విమానాల్లో వచ్చి బేగంపేటలో దిగుతుండడంతో అక్కడి నుంచి హెచ్‌ఐసీసీ వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లి నుంచి ప్రత్యేక విమానంలో జులై 2వ తేదీ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాక అక్కడి నుంచి కార్యవర్గ వేదిక హెచ్‌ఐసీసీ వరకు రోడ్‌షో నిర్వహించాలన్న ప్రతిపాదనకు వచ్చారు. అయితే ఇందుకు ప్రధాని భద్రతగా ఉండే నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) ఆమోదం తెలపాల్సి ఉందని ఆ తర్వాతే ఈ రోడ్‌ షోపై నిర్ణయం వెలువడుతుందని సమాచారం.

రెండు రోజులపాటు పార్టీ అగ్ర నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేస్తుండడంతో వారికి ఎటువంటి లోటు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను ముందే బుక్‌ చేసి గదులను వారి పేర్ల మీద ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఈనెల చివరికల్లా కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే 300మంది ప్రతినిధులకు బస ఎక్కడ ఏర్పాటు చేసింది, గది నంబర్‌తో సహా ఈ-మెయిల్‌, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు జాతీయ కార్య వర్గ భేటీకి వస్తుండడంతో వారి వారి రాష్ట్రాల్లో వారు తినే భోజనం, ఇతర తినుపదార్థాలను సిద్ధం చేయించాలని ఇందుకు ఆయా రాష్ట్రాల నుంచి వంట వారిని రప్పించాలని ప్రతిపాదించారు. కార్యవర్గ సమావేశం రెండో రోజు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి తద్వారా తమ సత్తాను చాటుకోవాలని భావిస్తున్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు.

కార్యవర్గ సమావేశాలు ఇలా..

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జులై 2, 3 తేదీల్లో జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రణాళికను పార్టీ అధినాయకత్వం సిద్ధం చేసింది. జులై 2వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశాల తొలిరోజు స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రసంగిస్తారు. హైదరాబాద్‌లో ఈ సమావేశాలు నిర్వహిస్తుండడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ఈ రెండు రోజుల సమావేశం జరగనుంది. స్వాగతోపన్యాసం ముగిశాక గత కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అమలైన తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న భాజపా ఈ కార్యవర్గ సమావేశాల నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయించింది. కార్య వర్గ భేటీలో ప్రతిపాదించనున్న రాజకీయ తీర్మానంలో తెలు గు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement