Saturday, November 23, 2024

Modi Tour | యూఎస్‌ పర్యటనకు ప్రధాని రెడీ.. 21 నుంచి టూర్‌

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనేక విశేషాల సమాహారంగా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 21 నుంచి 24 వరకు మోదీ అమెరికాలో చేపడుతున్న పర్యటన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమెరికాలో చేస్తున్న ఆరవ పర్యటన అవుతుంది. చర్చిల్‌, మండేలా సరసన మోడీ జూన్‌ 22న అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

రెండవసారి ప్రసంగించే అవకాశం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. అంతకు మునుపు 2016లో యూఎస్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇదే విషయమై విదేశీవ్యవహారాల మంత్రి ఎస్‌ జై శంకర్‌ మాట్లాడుతూ ”ఏ ఒక్క భారత ప్రధాని కూడా రెండు సార్లు అక్కడ (యూఎస్‌ కాంగ్రెస్‌లో) ప్రసంగించలేదు. కనుక అలా ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండెలా లాంటి అతి కొద్దిమంది వ్యక్తులు మాత్రమే యూఎస్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి రెండుసార్లు ప్రసంగించారు.

- Advertisement -

అందుకనే ఆ ప్రసంగానికి(ప్రధాని ప్రసంగం) అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది” అని అన్నారు. అధికారిక పర్యటన జరిపే గౌరవాన్ని దక్కించుకున్న రెండవ భారత ప్రధానిగా మోడీ నిలుస్తారు. ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రోన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నుంచి అమెరికాలో అధికారిక పర్యటనకు, డిన్నర్‌కు ఆహ్వానం అందుకున్న మూడవ ప్రపంచ నేతగా ఒక అరుదైన గౌరవాన్ని మోడీ పొందారు. దౌత్యపరంగా అత్యున్నమైన స్థాయి ఆహ్వానం అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుల్లో కొందరికి మాత్రమే లభించే అవకాశమని జైశంకర్‌ అన్నారు.

అమెరికాలో స్టేట్‌ విజిట్‌ జరుపుతున్న మూడవ భారతీయ నేత

అమెరికాలో స్టేట్‌ విజిట్‌ జరుపుతున్న మూడవ భారతీయ నేతగా పీఎం మోడీ ఉన్నారు. గతంలో రెండు స్టేట్‌ విజిట్‌లలో ఒకదాన్ని 1963లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేపట్టగా, రెండవ స్టేట్‌ విజిట్‌ను 2009 నవంబర్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేపట్టారు. వైట్‌ హౌస్‌ వర్గాల ప్రకారం ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ళలో నరేంద్ర మోడీ తొలిసారిగా అమెరికాలో స్టేట్‌ విజిట్‌ జరుపుతున్నారు. గతంలో ప్రధాని మోడీ అమెరికాలో జరిపిన పర్యటనలను వర్కింగ్‌ విజిట్‌ (2014), వర్కింగ్‌ లంచ్‌(2016), అఫిషియల్‌ వర్కింగ్‌ విజిట్‌(2017) అని అమెరికా ప్రభుత్వం వర్గీకరించింది.

2019లో ఆయన అమెరికాలో చేపట్టిన పర్యటనను ”టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఒక సభలో ఆయన పాల్గొన్నారు” అని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దీటైన శక్తిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా.. భారత్‌ ప్రధాని పట్ల అత్యంత గౌరవ మర్యాదలను ప్రదర్శించడం ద్వారా, తాను చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ ఎంత కీలకమైనదనే విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పింది.

పర్యటనలో కీలకమైన అంశాలు

  1. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద జరిగే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు.
  2. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జూన్‌ 22న ప్రసంగిస్తారు.
  3. జూన్‌ 22న వైట్‌ హౌస్‌ వద్ద లాంఛనపూర్వకమైన ఆహ్వానాన్ని అందుకుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు.
  4. వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌ హౌస్‌లో జూన్‌ 22న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అధికారిక డిన్నర్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ఆతిథ్యమిస్తారు.
  5. జూన్‌ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, స్టేట్‌ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే మధ్యాహ్న విందుకు ప్రధాని హాజరవుతారు. ప్రముఖ కంపెనీల సీయీవోలు, నిపుణులు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖలను కలుసుకుంటారు. ప్రవాస భారతీయులతో మోడీ ముచ్చటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement