Friday, November 22, 2024

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు.. వర్చువల్‌గా భేటీ అయిన‌ మోడీ

”ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి ఆడండి… ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరంతా చక్కటి శిక్షణ పొందారు. ఆ శిక్షణను మరి మీ ఇచ్ఛాశక్తిని చాటుకోవలసిన సమయం ఆసన్నమైంది. మీరు ఇంతవరకు సాధించింది తప్పక ప్రేరణ అందించేదే. అయితే ఇక మీరు సరికొత్తగా కనపడుతూ, కొత్త రికార్డులను సాధించాలి” అని క్రీడాకారులలో ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తిని నింపారు. బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి జరుగబోయే కామన్వెల్త్‌ క్రీడలలో పాల్గొనబోయే క్రీడాకారులతో ప్రధాని నరేంద్రమోడీ బుధవారంనాడు వర్చువల్‌గా సమావేశమై మాట్లాడారు. ఈ గేమ్స్‌కు భారత ఒలింపిక్స్‌ సంఘం 322 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు.

215మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలతోపాటు 141 ఈవెంట్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లతో వర్చువల్‌గా ఇంటరాక్ట్‌ అయిన ప్రధాని మోడీ.. వారిలో స్ఫూర్తిని నింపారు. భారతదేశంలో క్రీడల కొత్త శకం మొదలైందన్న మోడీ… విజయాలతో రాగానే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుందామని హామీనిచ్చారు. నయా భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఈవెంట్‌లో అంచనాలను మరిచి తమ అత్యుత్తమ ఆటతీరుపై దృష్టి పెట్టాలని మోడీ వారికి సూచించారు. అథ్లెట్ల పోరాటం, పట్టుదల, వారి సంకల్పాన్ని హైలెట్‌ చేసిన ప్రధాని… కామన్వెల్త్‌ క్రీడల్లో విజయం సిద్ధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 3000 మీట్లర్ల స్టీఫుల్‌ ఛేజర్‌ అవినాష్‌ సేబుల్‌, వెయిట్‌ లిఫ్టర్‌ అచింత షెయులీ, మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి సలీమా టెటె, సైక్లిస్ట్‌ డేవిడ్‌ బెక్‌ హమ్‌, పారా షాట్‌ పుటర్‌ షర్మిలతో మోడీ ముచ్చటించారు. ప్రధాని మోడీతో ఇంటరాక్షన్‌లో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, ఒలింపిక్‌ డబుల్‌ మెడల్‌ విజేత పీవీ సింధు, మహిళల హాకీ గోల్‌ కీపర్‌ సవితా పునియా, రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, బాక్సర్లు, షట్లర్లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement