Saturday, November 23, 2024

జీఎస్టీతో పెరగనున్న ధరలు..

న్యూఢిల్లి : ఇప్పటికే అధిక ధరలో అల్లాడుతున్న సామాన్యులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడనుంది. ఒక వైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుం టూ పోతున్నది. మరో వైపు ప్రభుత్వం కనిపించినదానిపైనల్లా పన్నులు వేసుకుంటూ పోతున్నది. అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం రెండూ సామాన్యులపైనే గురిపెట్టి మరి బాదుతున్నాయి. సోమవారం నుంచి సామాన్యులపై మరింత భారంపడనుంది. పెంచిన జీఎస్టీ రేట్లు ఈ నెల 18 నుండే అమల్లోకి వస్తాయి.

పాలు, పెరుగుపై బాదుడు
ప్రజలు నిత్యం వాడే అనేక నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ని పెంచుతూ 47వ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సోమవారం (18వతేదీ) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రోజువారి వినియోగించే అనేక నిత్యావసరాలపై సామాన్యులు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. గతంలో బ్రాండెడ్‌ ప్యాకేజీ ఐటమ్స్‌పై మాత్రమే జీఎస్టీ వసూలు చేసేవారు. ఇక నుంచి ప్యాక్‌ చేసిన అన్నింటిపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పుడు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, లస్సీ, ఇలా అనేకం మార్కెట్‌లో ప్యాకేట్లలో ఉండే వాటిపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ మేరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడనుంది. ఇలా జీఎస్టీ చెల్లించే వినియోగదారులు ఇన్‌పుట్‌ సబ్సీడిని క్లౌమ్‌ చేసుకోలేదు. వీటితో పాటు ప్యాకే చేసిన బియ్యం, గోధుమ పిండి, కారం, పసుపు ఇలా ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉంది.

బ్రాండెడ్‌ కాకున్నా ప్యాక్‌ చేసిన వాటిపై జీఎస్టీ
వసూలు చేయాలని జూన్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది వ్యాపారులు ఇలా ప్యాక్‌ చేసిన వాటిని అమ్ముతూ, ఇన్‌పుడ్‌ సబ్సిడీని పొందుతున్నారని భావించిన ప్రభుత్వం, అన్నింటిపైనా జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్‌ చెక్‌బుక్స్‌పై కూడా….
బ్యాంక్‌లు కస్టమర్లకు జారీ చేసే చెక్‌బుక్స్‌పై సర్వీస్‌ ఛార్జీ వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా వసూలు చేసే సర్వీస్‌ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంటే ఇక నుంచి కస్టమర్లు సర్వీస్‌ ఛార్జ్‌తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఎల్‌ఈడీ లైట్స్‌, పిక్చర్స్‌ పై కూడా ఇక నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

ఆసుపత్రుల బెడ్స్‌పై
ఇక నుంచి ఆసుపత్రుల్లో బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. గతంలో వీటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. ఐసీయూ బెడ్స్‌ను మాత్రం ఈ సారి మినహాయించారు. ఐదు వేల కంటే ఎక్కవ రోజువారి రెంట్‌ ఉండే రూమ్‌లపై సోమవారం నుంచి జీఎస్టీ వసూలు చేస్తారు. హోటల్స్‌లో రోజుకు 1000 రూపాయల కంటే తక్కువగా ఉన్న రూమ్‌లపై ఇక నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. గతంలో టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వెయ్యి రూపాయల కంటే తక్కవ రేటు ఉన్న రూమ్స్‌పై జీఎస్టీని వసూలు చేయలేదు. చాలా హోటల్స్‌ దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. రూమ్‌కు ఎంత వసూలు చేసినా, బిల్లు మాత్రం వెయ్యి రూపాయలలోపుగానే ఇస్తున్నారని వార్తలు రావడంతో దీన్ని తొలగించారు.

- Advertisement -

సామాన్యుడి బడ్జెట్‌ తలక్రిందులు
నిత్యం వాడే వాటిపై భారీగా పన్ను పెంచడం వల్ల సామాన్యుల వంటింటి బడ్జెట్‌ తారుమారవుతుంది. వారి నెలవారి బడ్జెట్‌ తలక్రిందులవుతుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి మిడిల్‌, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ కుటుంబాల బడ్జెట్‌ తారుమారైంది. అన్నింటికీ గతం కం టే అధికంగానే చెల్లిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు రెండు సార్లు పెంచింది. ఇంకా అది అదుపులోకి రాలేదు. దీంతో మరోసారి వడ్డీ రేట్లు పెంపుదల ఉంటుందని ఆర్బీఐనే స్వయంగా ప్రకటించింది. దీని వల్ల బ్యాంక్‌ల్లో రుణాలతో సొంతింటిని సమకూర్చుకున్న సామాన్యులకు ఈఎంఐలు భారంగా మారాయి. చాలా మంది ఉద్యోగులు ఇల్లు, కారు, లేదా ద్విచక్ర వాహనాలు, టీవీ, ప్రీజ్డ్‌.. ఇలా పలు గృహోపకరణాలు సైతం ఈఎంఐ పద్దతిలోనే కొనుగోలు చేస్తున్నారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై కూడా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని బ్యాంక్‌లు వడ్డీ రేట్లు పెంచాయి. ఇలా ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధికంగా చెల్లిస్తున్నారు. సోమవారం నుంచి ఇలా అన్ని రకాల నిత్యావసరాలపై జీఎస్టీ రూపంలో సామాన్యులపై మరింత భారం మోపుతున్నది. ఆర్బీఐ రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ, ఇంకా ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగానే నమోదవుతున్నది.

బ్లేడు, షార్పనర్‌లపై కూడా పన్ను
వీటితో పాటు వంటింటిలో వాడే కూరగాయలు కోసే కత్తులు, కట్టింగ్‌ బ్లేడ్లు, పేపరు కత్తులు, పన్సిల్‌ చెక్కుకునేందుకు ఉపయోగించే షార్పనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కీమ్మర్లు, గోధుమ పిండి, అప్పడాలు, తేనెె, కేక్‌ సర్వరులు , ఈ నెల 18 నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ప్రిటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌లపై 12 నుంచి 18 శాతానికి జీఎస్టీ పెంచారు. టెట్రా ప్యాక్‌పై 12 నుంచి 18 శాతానికి పెంచారు. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌ వర్క్‌పై 5 నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంచారు. రోడ్లు, వంతెనలు, మెట్రో , శుద్ది ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 12 నుంచి 18 శాతానికి పన్ను పెంచారు. మ్యాప్‌లు, ఛార్జులు, అట్లాస్‌ వంటి వాటిపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. బ్యాటరీ ప్యాక్‌ ఉన్నా , లేకున్నా ఇక నుంచి విద్యుత్‌ వాహనాలకు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఆర్బీఐ, ఐఆర్‌డిఏ, సెబీ వంటి సంస్థలు అందించే సేవలపైనా ఇక నుంచి పన్ను వసూలు చేస్తారు.

కొన్నింటిపై తగ్గింపు
రోప్‌ వే ద్వారా చేరవేసే ప్రయాణీకులు, వస్తువులపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇంధనంతో కలిసి కిరాయికి తీసుకునే గూడ్స్‌ కారియర్స్‌పై 18 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించారు. కొన్ని ఆర్ధోపెడిక్‌ ఉపకరణాలపై పన్ను రేటును 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.

క్యాసినో, ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ….
క్యాసినో, ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ఎంత జీఎస్టీ విధించాలన్న దానిపై గత సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. గుర్రం పందెలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల గ్రూప్‌ సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement