Tuesday, November 26, 2024

త‌గ్గుముఖం ప‌ట్టిన కూర‌గాయ‌ల ధ‌ర‌లు.. హైద‌రాబాద్ సిటీకి పెరిగిన స‌ప్ల‌య్‌

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: హైదరాబాద్‌ నగరంలో కూరగాయల ధరలు సగానికి పైగా తగ్గాయి. నెల రోజుల వరకు ఆకాశాన్నింటిన కూరగాయలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. టమాట ధర అమాంతం దిగింది. నవంబర్‌ చివరి వారంలో కిలోకు రూ.50 పలికి టమాట నెలరోజుల్లోనే రూ.10కి పడిపోయింది. బీరకాయ, చిక్కుడు, వంకాయ, బెండ, కాకర, క్యారేట్‌ తదితర అన్ని కూరగాయల సగానికి పైగా దిగాయి. ఏ కూరగాయలైనా కిలోకు రూ.40 లోపే దొరుకుతున్నాయి. బోయన పల్లి మార్కెట్లో సాధారణ రోజుల్లో 30 వేల నుంచి 40 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌, ఎన్టీఆర్‌ మార్కెట్లో 10 వేల క్వింటాళ్ల కూరగాయలు సరఫరా అయ్యేవి. గత వారం రోజులుగా రెట్టింపు వస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలోని 11 ప్రధాన రైతు బజార్ల కు సైతం కూరగాయలు పోటెత్తుతున్నాయి. డిమాండ్‌కు మించి నగరానికి కూరగాయలు సరఫరా కావడంతో ధరలు అమాంత దిగివచ్చినట్టు భావిస్తున్నారు. మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు ఇలాగే అదుపులో ఉంటాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

నగరానికి పెరిగిన రవాణా

కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్‌ నగరానికి ప్రతి రోజు దాదాపు 300 మైట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం ఉంటుంది. నగర ప్రజల అవసరాలకు మించి దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా నగరంలో ఉన్న మూడు హోల్‌సెల్‌ మార్కేట్లైన గుడి మల్కాపూర్‌, బోయినపల్లి, ఎన్టీఆర్‌ మార్కెట్లతో పాటు రైతు బజార్లు కూరగాయలతో కళకళ లాడుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, సిద్దిపేట , వికారాబాద్‌, సంగారెడ్డి తదితర చుట్టు పక్కలజిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి దిగుమతి అవుతాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నగరానికి రవాణా అయ్యే రాష్ట్రాల్లో ఈ సారీ కూరగాయల ఉత్పత్తి భారిగా పెరిగినట్టు తెలుస్తోంది. దాంతో నగరానికి కూరగాయల రవాణా పెరిగిందని, రాబోయే నెల రోజుల పాటు కూరగాయల ధరలు ఇలాగే అదుపులో ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.

- Advertisement -

నగరంలోని మార్కెట్లలో ప్రధాన కూరగాయల ధరలు

టామాట రూ. 5 నుంచి రూ. 10
బెండకాయ రూ. 20 నుంచి రూ. 30
కాకర రూ. 30 నుంచి రూ. 40
చిక్కుడు రూ. 30 నుంచి రూ. 40
క్యారేట్‌ రూ. 30 నుంచి రూ. 40
దొండకాయ రూ. 30 నుంచి రూ. 40

Advertisement

తాజా వార్తలు

Advertisement