దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల పరిశ్రమలను కోరింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున ఒక్కో లీటర్‌పై 8 నుంచి 12 రూపాయల వరకు తగ్గించాలని కేంద్రం కోరింది. దీనిపై పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో నూనెల ధరలు తగ్గించాలని కోరినట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్పా తెలిపారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుతో పాటు ఇన్‌పుట్, రవాణా వ్యయాలు పెరగడంతో 2021-22లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి.
అంతర్జాతీయంగా 2022 జూన్ నుంచి ధరలు తగ్గుతున్నాయి. అందుకు అనుగుణంగా దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. అంతర్జాతీయ ధరలు తగ్గినంత వేగంగా దేశీయంగా కంపెనీలు నూనెల ధరలు తగ్గించడంలేదు. దీంతో రంగంలోకి దిగిని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు గతంలోనూ ఇలానే సమావేశాలు పెట్టి ధరలు తగ్గించాలని కంపెనీలను ఆదేశించింది.
ప్రభుత్వం ఈ సారి లీటర్‌పై 8-12 రూపాయల వరకు తగ్గించాలని కోరింది. వీటి తగ్గింపు త్వరలోనే ప్రారంభమవుతుందని, దీని వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉందని ఆహార మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ప్రభుత్వ సూచనలకు నూనెల కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి.