Tuesday, November 26, 2024

కోచింగ్‌ సెంటర్ల ఫీజుల దోపిడీకు అడ్డుకట్ట! నిబంధనలకు విరుద్ధంగా నడిచేవాటిపై విద్యాశాఖ చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేవలం హైదరాబాద్‌ మహానగరంలో ఉన్నన్ని పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లు మిగతా అన్ని జిల్లాల్లోని సెంటర్లను కలిపినా అంతఉండవు. కోచింగ్‌ సెంటర్లకు అధికంగా డిమాండ్‌ ఉండడంతో ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా కోచింగ్‌ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఏమాత్రం నిబంధనలు పట్టించుకోకుండా చిన్న చిన్న గదులు, ఫంక్షన్‌ హాళ్లలో వందల మందిని కోడిపిల్లలను కుక్కినట్టు కుక్కి కోచింగ్‌ ఇస్తున్నారు. పైగా అభ్యర్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. తమకు ఎవరి నుంచి అడ్డుఅదుపు లేదనే ధీమాతో నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనను వెలువరిచడంతో ఫీజుల దందాకు తెరలేపాయి. కొన్ని కోచింగ్‌ సెంటర్లు గ్రూప్‌-1, గ్రూప్‌-2, సివిల్స్‌ లాంటి పోటీ పరీక్షలకు దాదాపు రూ. లక్ష నుంచి లక్షలన్నర వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఉపక్రమించింది. కోచింగ్‌ సెంటర్ల నిర్వహణ, ఫీజులు దోపిడీ, ఫ్యాకల్టి, కోచింగ్‌ సెంటర్లలో అభ్యర్థులకు ఏ విధమైనా వసతులు లభిస్తున్నాయనే దానిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కమిటీని వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. కోచింగ్‌ కేంద్రాల ఫీజుల విషయంలో అధికారుల నుంచి ఒక నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కోన్ని కోచింగ్‌ సెంటర్లకు అనుమతి ఉండదు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు ఉండవు. బ్రాంచీలను పెట్టుకొని కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిపై అధికారుల నియంత్రణ లేకపోవడంతోనే ఇవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకొని…

ఫీజులను ఎంత పెంచినా ఉద్యోగం సాధించాలనే ఆశతో నగరానికి వచ్చే నిరుద్యోగ యువత చేసేదేమీ లేక నిర్వహకులు అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఇలా నిరుద్యోగుల నిస్సాహయతను ఆసరాగా చేసుకుని కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. కోచింగ్‌ను తీసుకోకుండా ఉద్యోగం సాధించలేమనే అభిప్రాయాన్ని రుద్దుతుండడంతో కోచింగ్‌ కేంద్రాలకు ఎగబడుతున్నారు. దీంతో కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

కోచింగ్‌ కేంద్రాలకు అభ్యర్థుల క్యూ..

సివిల్స్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4తో పాటు, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పుకోవాలి. దీంతోనే చాలా మంది అభ్యర్థులు ఫీజు ఎక్కువైనా సరే హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్‌ తీసుకునేందుకు మక్కువ చూపుతారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. పైగా వయోపరిమితిని కూడా పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే కనబడుతోంది. కోచింగ్‌ పొందేందుకు హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు మూతపబడిన కోచింగ్‌ కేంద్రాలు, హాస్టళ్లు మళ్లిd తిరిగి తెరుచుకున్నాయి. కోచింగ్‌ కేంద్రాల్లో సీట్లు, హాస్టళ్లలో బెడ్లు నిండిపోతున్నాయి. ఇదే అదునుగా చేసుకొని కొందరు సామర్థ్యానికి మించి తరగతి గదుల్లో, హాస్టళ్ల రూముల్లో కుక్కి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. తరగతి గదుల్లో పెద్ద పెద్ద హాళ్లు ఏర్పాటు చేసి 200 నుంచి 1000 మంది వరకు ఉంచుతున్నారు. కనీస సౌకర్యాలు లేని ఫంక్షన్‌ హాళ్లు, సిటీ మాల్స్‌లో తరగతులు నిర్వహిస్తూ కనిష్టంగా రూ.10,000, గరిష్టంగా రూ.లక్షలన్నర వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కోచింగ్‌ సెంటర్లపై నియంత్రణ ఉండాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -

కోచింగ్‌ సెంటర్లపై పర్యవేక్షణ ఏదీ?..

కోచింగ్‌ సెంటర్లు కూడా విద్యావ్యవస్థలో భాగమే. కానీ అది తమ బాధ్యత కాదనేలా అధికారులు వాటి గురించి పట్టించుకోవడంలేదు. కోచింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని నిరుద్యోగులు అంటున్నారు. ఫీజు రెగ్యులేషన్‌ చేసి, వాటి పనితీరుపై విద్యాశాఖ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కేంద్రాల్లో సౌకర్యాలు నిల్‌!…

వసూలు చేస్తున్న ఫీజులకు అనుగుణంగా కేంద్రాల్లో కనీస వసతులు కూడా ఉండవు. ఒక్కో బ్యాచ్‌కి 200, 500, 1000 మందిని రూమ్‌లలో కుక్కి వందల కోట్లు దండుకుంటున్నారు. అంతమందికి రెండు, మూడు టాయిలెట్స్‌ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. గాలి వెలుతురు లేని రూమ్‌లు, గంటల తరబడి ఒకే గదిలో క్లాసులను నిర్వహిస్తున్నారు. అంత మందిలో అధ్యాపకులు చెప్పేది కూడా సరిగా వినబడని పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకొని అనుమతి, వసతులు లేని, అధికంగా ఫీజులు వసూలు చేసే కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినబడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement