Saturday, November 23, 2024

బ్యాంక్ మోసాలను అరికట్టండి, సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోండి : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బ్యాంక్ మోసాల కేసుల్లో ఆర్థిక మంత్రి జోక్యం చేసుకుని, మొత్తం సొమ్మును రికవరీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో బ్యాంకు మోసాల అంశాన్ని సోమవారం లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ఆయన ప్ర‌త్యేకంగా‌ ప్ర‌స్తావించారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని 2019 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. వాస్తవంగా చూస్తే ఏడేళ్లలో బ్యాంకు మోసాలు మాత్రం 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించాయిని, ఒక్క 2020-21లో బ్యాంక్ ఫ్రాడ్ రుణాలు మొత్తం రూ. 1.37 లక్షల కోట్లని ఆయన వివరించారు.

మార్చి 31, 2021 నాటికి బ్యాంకుల్లో రూ. 4.92 ట్రిలియన్ల మోసాలు జరిగాయని, మొత్తం బ్యాంక్ క్రెడిట్‌లో 4.5 శాతానికి పైగా ఉన్నాయని ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన మోసాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత దారుణమైన మోసాలను భరించాయని తెలిపారు. 2019-21 గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2.94 లక్షల కోట్ల మోసాలు జరిగాయని, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ.86,355 కోట్ల మోసాలు చోటు చేసుకున్నాయని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభాకర్ రెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement