న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మూడు దశాబ్దాలుగా చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా తెలుగు డాక్టర్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం వరించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయా, తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్నారు. వారందరి సమక్షంలో పాలమూరుకు చెందిన డాక్టర్ ఏ. నటరాజు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు.
దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇద్దరికి మాత్రమే బంగారు పతకం వరించగా… అందులో నటరాజు ఒకరు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వందేళ్లకు పైగా సేవలందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నటరాజుకు స్వాతంత్ర్య సమర నేపథ్యం ఉంది. 32 ఏళ్లుగా సమాజ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1990 నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తోంది. గతంలో పాలమూరు మాజీ కలెక్టర్ అనంత రాములు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ కమిటీలో ఆయన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఆ తర్వాత 2002లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పదివేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయించి రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని నేటికీ ఆ స్థానాన్ని నటరాజు నిలబెడుతూ వచ్చారు.
2005లో సన్నిధి పేరుతో ఓ అనాథ శరణాలయం ఏర్పాటు చేసి నేటికీ ఎంతో మందికి సేవ చేస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాస్కులు, సానిటైజేషన్, తాగునీరు, ఆహారం, ఎనర్జీ డ్రింక్స్ సరఫరా చేశారు. అనాథ 48 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోన కాలం నుంచి తన సతీమణి కల్యాణి పేరుతో పెట్టి ప్రతిఏడాది బియ్యం, పప్పుల కిట్స్ వేలాది మందికి అందిస్తున్నారు.పేద విద్యార్థుల విద్యకు సహాయం, అవయవ దానం చేయించడం వంటి సేవల్లోనూ నటరాజు తనదైన ముద్ర వేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా తాను చేపట్టిన కార్యక్రమాలకు రాష్ట్రపతి పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు