Tuesday, November 26, 2024

Story : రాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు ముమ్మరం.. ఆదివాసీ రాష్ట్రపతి వేటలో అధికారపక్షం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడం కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార విపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం కోసం అధికారపక్షం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అధికార ఎన్డీయే కూటమిలోని పార్టీలతోనే కాదు, యూపీఏ, తటస్థ రాజకీయ పక్షాలతో కూడా చర్చలు, మంతనాలు సాగించి ఏకాభిప్రాయం సాధించాలని చూస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఇతర రాజకీయ పక్షాలతో మంతనాలు సాగించే బాధ్యతను అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై జాతీయ పార్టీ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టేలోగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ 22 మందికి లేఖలు రాసి ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఈ నెల 15న (రేపు) ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సోనియా గాంధీని సైతం ఆహ్వానించడం గమనార్హం. ఈ ఆహ్వానం అందుకున్నవారిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఢిల్లీ సీఎం – ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలున్నారు. విపక్ష కూటమికి నాయకత్వం వహించాలని తహతహలాడుతున్న మమత ప్రయత్నాలకు అందరి సమ్మతి లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో మమత ఏర్పాటు చేసిన సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇకపోతే మమత మదిలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరున్నారు? ఎవరిని ప్రతిపాదించే అవకాశం ఉందన్న అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్ మదిలో శరద్ పవార్!!!

ఆలస్యంగా తేరుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉమ్మడి అభ్యర్థి విషయంలో వివిధ విపక్ష పార్టీలతో చర్చించే బాధ్యతను రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఇకపోతే ఉమ్మడి అభ్యర్థిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే గత వారమే శరద్ పవార్‌ను కలవడం వెనుక కారణం ఇదే అయ్యుంటుందని చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై పవార్ ఆచితూచి స్పందించే ధోరణిలో ఉండగా, ఉమ్మడి అభ్యర్థి అంశంపై ఖర్గే తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం – శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపారు. శరద్ పవార్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. వివిధ రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కూటములను ఏర్పాటు చేయడంలో ఆయనది అందెవేసిన చేయిగా రాజకీయవర్గాలు చెబుతుంటాయి. తాజాగా మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడం వెనుక ఆయనదే కీలక పాత్ర అన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా మహారాష్ట్ర వెలుపల వివిధ రాజకీయ పార్టీలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. వీటన్నింటికీ తోడు కాంగ్రెస్ పార్టీయే ఆయన పేరును ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదించడం ఆయనకు కలిసొచ్చే అంశం.

ఇదిలా ఉంటే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు విపక్షాల్లో సమాజ్‌వాదీ సహా మరికొన్ని పార్టీలు మద్ధతు తెలిపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిపై విపక్షాల్లో ఏకాభిప్రాయం సాధించడమే పెద్ద సవాలుగా మారింది. ఏకాభిప్రాయ సాధన కోసం చేస్తున్న ప్రయత్నాల్లోనే ఏకాభిప్రాయం లేని చందంగా మమత బెనర్జీ ఓవైపు, సోనియా గాంధీ మరో వైపు కసరత్తు మొదలుపెట్టారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ వచ్చేలోపు ఉమ్మడి అభ్యర్థిపై కసరత్తు, ఏకాభిప్రాయ సాధన విపక్ష కూటమి ముందున్న సవాలు.

- Advertisement -

కేసీఆర్ దారెటు?

బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో రాజకీయ పార్టీని నెలకొల్పేందుకు సమాయత్తమైన టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు, మమత బెనర్జీ ఆహ్వానాన్ని మన్నించి ఆ సమావేశానికి హాజరవుతారా అన్నది ఇప్పుడు దేశరాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా తనకు ఆహ్వానం అందడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల సంగతెలా ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలుపొందాలంటే ఎన్డీయే కూటమిలో లేని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో విపక్షాల అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా తక్కువ. ఈ క్రమంలో 2024 నాటికి కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టినా, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నడవక తప్పని పరిస్థితి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు తెలిపి ఓటేసిన టీఆర్ఎస్, ఈసారి ఎన్డీయేకు వ్యతిరేకంగా కత్తులు నూరుతున్న సమయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అంతుచిక్కని కమలనాథుల సమీకరణాలు

ప్రతిసారీ ఊహలకు, అంచనాలకు అందకుండా అభ్యర్థులను రంగంలోకి దించుతున్న మోదీ-షా ద్వయం ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోనూ నెలకొంది. గత ఎన్నికల్లో దళిత ఓటుబ్యాంకుపై గురిపెట్టి, ఆ సమీకరణాల్లో భాగంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చిన కమలదళ అధినేతలు, ఈసారి ఏ సమీకరణాలకు పెద్దపీట వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు ఆదివాసీ-గిరిజనులకు దేశ ప్రథమ పౌరుడిగా ఎవరూ అవకాశం కల్పించలేదు కాబట్టి, ఈసారి ఆదివాసీ సమూహానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పైగా ఆదివాసీ-గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఒక్క మధ్య ప్రదేశ్ మినహా మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. వీటిని చేజిక్కించుకోవాలంటే ఆదివాసీలను ఆకట్టుకుని, వారిని పూర్తిగా తమ ఓటుబ్యాంకుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆదివాసీ-గిరిజన వర్గాలకు చెందిన నేతను ఎంపిక ఎక్కువ ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ గిరిజన నేతనే అభ్యర్థిగా ప్రకటించే పక్షంలో మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జ్యుయల్ ఓరంల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం కల్పించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, దళిత సమీకరణాలకు పెద్దపీట వేయడంతో రామ్‌నాథ్ కోవింద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. గిరిజనులకు అవకాశమివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తే ద్రౌపది ముర్ము పేరు ముందువరుసలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా బీజేపీ అధిష్టానం తమపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను పోగొట్టుకోవడం కోసం మైనారిటీ సమీకరణాలను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. నిజానికి ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు చాలావరకు లేనప్పటికీ, అంతర్జాతీయ సమాజంలో ఎదుర్కొంటున్న అపప్రదను ఆ పార్టీ తీవ్రంగానే పరిణగిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీయే అభ్యర్థిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాంకు అవకాశమిచ్చిన కమళదళం మరోసారి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే.. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న నఖ్వీ రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. 15 రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రాంపూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లోనైనా అవకాశమిస్తారని భావిస్తే.. చివరకు అక్కడా ఆయన పేరు కనిపించకపోవడంతో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రపతిగా గిరిజన అభ్యర్థిని బరిలోకి దించితే, ఉపరాష్ట్రపతిగా ముస్లిం వర్గాలకు చెందిన నేతనే ఎన్నుకుంటారని పార్టీ వర్గాల సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement