ఆంధ్రప్రభ స్టార్మ్… న్యూఢిల్లీ ప్రతినిథి : భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం.. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.
రాష్ట్రపతి నివాళులు….
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ”మన సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక విజయగాథ. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్‌కు నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందుతారు. జై హింద్. జై భారత్” అని రాష్ట్రపతి రాసుకొచ్చారు.
కార్గిల్ లో మోదీ….
కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ నేటి ఉదయం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.
ఢిల్లీలో రాజనాథ్ సింగ్ ….
ఇక, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వబోమని అన్నారు.