రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అగర్తలలోని తేయాకు కార్మికులను కలుసుకున్నారు. వారితో ముచ్చటిం చారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. మీ పిల్లల్ని స్కూలుకు పంపుతున్నారా? ఉచిత రేషన్ వంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అంటూ ఓ మహిళను ప్రశ్నించారు. అదే సమయంలో తనపక్కనే ఉన్న సీఎం మాణిక్ సాహా, స్థానిక ఎమ్మెల్యే కృష్ణదాన్ దాస్‌లను చూపిస్తూ వీరిని గుర్తుపట్టగలరా? అని తేయాకు కార్మికులను అడిగారు.
వారంతా తెలుసునంటూ తలఊపారు. వీళ్లు ఇక్కడి వారే.మీకే ఏ సమస్య వచ్చినా వారిని సంప్రదించండి అంటూ రాష్ట్రపతి వారికి సూచించారు. రెండు రోజుల త్రిపుర పర్యటనలో భాగంగా ఆమె బుధవారం అగర్తల చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆమెకు గవర్నర్ సత్యనారాయణ్ ఆర్య, సీఎం మాణిక్ సాహా, కేంద్రమంత్రి ప్రతిమి భౌమిక్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నర్సింగర్ చేరుకున్న రాష్ట్రపతి, హైకోర్టు సీజే జస్టిస్ ఇంద్రజిత్ మహంతితో కలిసి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని (ఎన్‌ఎల్‌యు) ప్రారంభించారు. అనంతరం దుర్గాబారి తేయాకు ఎస్టేట్‌ను సందర్శించారు. అక్కడి కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తేయాకు ఎస్టేట్ వద్ద సాంస్కృతిక కార్యకలాపాలు ఏర్పాటుచేశారు.