Saturday, November 23, 2024

మోడీ ప‌థ‌కాల‌పై రాష్ట్ర‌ప‌తి ముర్ము ప్ర‌శంస‌ల జ‌ల్లు….

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న‌ప‌లుప‌థ‌కాల‌ను భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌శంసించారు.. పేద ప్ర‌జ‌ల కోసం,మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం మోడీ తీసుకొచ్చిన ప‌థ‌కాలు మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్నాయంటూ కితాబు ఇచ్చారు.
కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో తొలిరోజైన మంగ‌ళ‌వారం నాడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేశారు. రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా ముర్ము పార్లమెంట్ లో మాట్లాడుతూ,
పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న్ స్కీమ్‌ను విస్త‌రించ‌డం ప‌ట్ల ఆమె సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స్కీమ్‌పై ప్ర‌పంచ దేశాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వేళ ప్ర‌జ‌ల ప్రాణ ర‌క్ష‌ణ కోసం త‌మ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని ముర్ము అన్నారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం కేంద్ర స‌ర్కార్ ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని, బేటీ బ‌చావో.. బేటీ ప‌డావో స‌క్సెస్ అయిన‌ట్లు ఆమె తెలిపారు. దేశంలో పురుషుల సంఖ్య క‌న్నా ఇప్పుడు మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. మ‌హిళ ఆరోగ్య స్థితి కూడా మెరుగుప‌డిన‌ట్లు ఆమె చెప్పారు. రైతుల ఆదాయాన్ని వృద్ధి చేశామ‌ని, గ్రామాల‌ను కూడా డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌రీబీ హ‌ఠావో స్కీమ్‌తో దేశంలో పేద‌రికాన్ని నిర్మూలించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఆమె చెప్పారు.
గ‌తంలో ట్యాక్స్ రిఫండ్ కోసం చాలా కాలం వేచి చూసేవాళ్లు అని, ఇప్పుడు కేవ‌లం కొన్ని రోజుల్లో ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్న్స్ వ‌స్తున్నాయ‌ని ఆమె తెలిపారు. అవినీతిని అంతం చేయాలంటే బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌ను నిర్మించాల‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యానికి.. సామాజిక న్యాయానికి అతిపెద్ద శ‌త్రువు అవినీతి అని రాష్ట్ర‌ప‌తి ముర్ము తెలిపారు. ఇండియా ప‌ట్ల ప్రపంచ దేశాల దృష్టి కూడా మారిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.
జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నుంచి ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు లాంటి కీల‌క అంశాలను త‌న ప్ర‌సంగంలో ముర్ము పేర్కొ న్నారు.
పేద‌రికం లేని భార‌త్‌ను నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భార‌త్ ను భిన్న కోణంలో చూస్తున్నాయ‌ని, ప్ర‌పంచ దేశాల‌కు ఇప్పుడు ఇండియా ప‌రిష్కారాలు ఇస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement